రాముని కంటే సీత పెద్దది కాదా? రాముని వయస్సు 25, సీత వయస్సు 18 సంవత్సరాలా?

బుధవారం, 9 డిశెంబరు 2015 (18:14 IST)
లక్ష్మణుడు, సీత పలికిన పరుష వాక్యములు వినలేక ఆ ప్రదేశమును వదిలి రాముని కొరకు వెళ్ళెను. అక్కడే చాటుగా సమయం కోసం ఎదురుచూస్తున్న రావణాసురుడు సన్యాసి రూపము ధరించి సీత వున్నచోటుకు వెళ్ళెను. సీత, రాముణ్ణి నిజమైన సన్యాసి అని నమ్మి అతనికి ఆతిథ్యమిచ్చి తన కుటుంబం గురించి రాముడితో ఎలా వివాహం జరిగిందీ, అయోధ్యలోని తన అత్తమామల గురించీ, రాముడి బలపరాక్రమములను వివరిస్తూ లక్ష్మణుడి గురించి ఇలా అన్నది ." ధర్మము ఆచరించువాడు. దృఢమైన నియమము కలవాడు అయిన లక్ష్మణుడనే పేరుగల సోదరుడు రామునితో, నాతో అరణ్యమునకు వచ్చెను". (111 47, 19). 
 
సీత రావణుడికి చెప్పిన మాటల ప్రకారము సీతారాముల వివాహము జరిగిన పిమ్మట వారిరువురు అయోధ్యలో దశరథుని భవనములో అన్ని భోగములను అనుభవిస్తూ 12 సంవత్సరములు గడిపారు. ఆ తర్వాత కైకేయి కోరిన వరము మేరకు రాముడు అరణ్యములకు ప్రయాణమైనాడు. రాముడు అడవులకు బయలుదేరినప్పుడు అతని వయస్సు 25 సంవత్సరాలు, సీత వయస్సు 18 సంవత్సరాలు (111 47-70). సీత రాముని కంటే పెద్దని అనే కొంతమంది వాదన ఈ  లోకంలో ఉన్నా.. అది తప్పు అని ఈ శ్లోకంలో చెప్పబడినది. 
 
ఇలా సీత చెబుతుండగా, రావణుడు తనను తాను పరిచయం చేసుకొని, అతని గొప్పతనాన్ని చెప్పుకున్నాడు. ఆ తర్వాత సీతను తనతో లంకకు రమ్మని, అక్కడ అన్ని విధములైన సుఖములను భోగములను అనుభవించవచ్చునని కోరాడు. రాముడు ఉత్తముడనియు, రావణుడు పరమనీచుడనియు, వారిరువురికీ మధ్య వున్న తేడాను పలు ఉదాహరణములతో సీత రావణునికి చెప్పెను. 
 
''నా భర్తయైన రాముడు మహాపర్వతము వలె కదల్చ శక్యము గానివాడు. మహేంద్రుడు వంటివాడు. మహాసముద్రమువలె క్షోభింప చేయశక్యము కానివాడు. నేను అట్టి రాముని విషయమునందే వ్రతము కలదానను. రాముడు సర్వలక్షణ సంపన్నుడు. వటవృక్షము వలె ఆశ్రితులకు సుఖము కలిగించువాడు. సత్యసంధుడు, మహా భాగ్యవంతుడు. రాముడు మహాబాహువు. విశాలమైన వక్షస్థలము గలవాడు. నరులలో శ్రేష్ఠుడు. సింహమువంటివాడు. రాజకుమారుడైన రాముడు పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడు. ఇంద్రియములను జయించినవాడు. గొప్పకీర్తి గల మహాత్ముడు. 
 
''నక్కవైన నీవు ఏమాత్రము లభ్యురాలు కాని ఆడ సింహమునైన నన్ను కోరుచున్నావు. సూర్యుని తేజస్సువంటి నన్ను నీవు స్పృశించజాలవు. రాముని ప్రియురాలైన భార్యను కోరుచున్న నీ ఆయువు క్షీణంచినది. నీవు నిజముగా అనేకములైన బంగారు వృక్షములను చూచుచున్నావు. (మరణమాసన్నమైన వారికి  బంగారువృక్షములు కనబడునని ప్రతీతి). మృగాలకు శత్రువు. చాలా బలము కలది అయిన ఆకలిగొన్న సింహము కోరను, మహాసర్పము కోరను లాగవలెనని కోరుచున్నావు. పర్వతములో శ్రేష్ఠమైన మందరపర్వతమును హస్తముతో గ్రహించవలెనని కోరుచున్నావు. కాలకూటవిషము త్రాగి సుఖముగా ఉండవలెననుకొనుచున్నావు. రాముని ప్రియురాలైన భార్యను పొందవలెనని కోరుచున్నావనగా నీవు సూదితో కళ్ళు పొడుచుకొనుచున్నావు. నాలుకతో కత్తిని నాకుచున్నావు. 
 
రాముని ప్రియురాలైన భార్యను అవమానింపదలచుచున్నావనగా నీవు పెద్ద రాతిబండను మెడకు కట్టుకుని సముద్రము దాటగోరుచున్నావు. చేతులతో సూర్యచంద్రులనిద్దరిని హరించవలెనని కోరుచున్నావు. నీవు రాముని భార్యను హరింపకోరుటున్నావనగా మండుచున్న అగ్నిని చూసి, దానిని వస్త్రములో మూటకట్టుకొనుటకు కోరుచున్నావు. రామునికి తగిన అతని భార్యను పొందకోరుచున్నావనగా నీవు ఇనుపకొసలున్న శూలముల చివరి భాగముల మీద నడువవలెనని కోరుచున్నావు.
 
వనములో నివసించే సింహానికీ, నక్కకీ ఎంత బేధమో, చిన్నబోది కాలువకు సముద్రానికి ఎంత బేధమో, ఉత్తమమైన మద్యానికి కడుగు నీళ్ళకు ఎంత బేధమో, మంచి గంధపు నీటికి బురదకు ఎంత బేధమో, వనములో హంసకు గ్రద్ధకూ ఎంత బేధమో, రామునకూ నీకూ అంతే బేధము. 
 
నీవు నన్ను అపహరించినా కూడా, అతడు ధనుర్బాణములు ధరించి నిలబడినచో ఈగ మింగిన వజ్రమువలె నీవు నన్ను జీర్ణము చేసుకొనజాలవు. పరిశుద్ధమైన మనోభావము గల ఆ సీత చాలా దుష్టుడైన ఆ రాక్షసునితో ఇట్లు పలుకుచునే, గాలికి ఊపివేయబడిన అరటి చెట్టువలె వణికిపోయెను. మృత్యుదేవతతో సమానమైన ప్రభావము గల రావణుడు వణికిపోవుచున్న సీతను చూచి, ఆమెకు భయము కలిగించుటకై తన కులమును, బలమును, కర్మను గూర్చి చెప్పెను. 
 
ఆ తర్వాత రావణుడు తన నిజ స్వరూపాన్ని సీతకు చూపించాడు. భారీ శరీరముతో, ఎర్రని కళ్ళతో, పది తలలతో భయంకరమైన అరుపులతో సీతను ఆ ప్రదేశము నుండి అపహరించాడు. ఎడమచేత్తో జుట్టును పట్టుకొని కుడిచేత్తో కాళ్ళను పట్టుకొని, కోడిపిల్లను గ్రద్ద ఎత్తుకొని పోతున్నట్లు, ఎగిరి తన రథములో కూర్చున్నాడు. రావణుని నిజస్వరూపమును చూసిన సీత కళ్ళు తిరిగి స్పృహ తప్పిపడిపోయింది. కొంతసేపటికి లేచి చూస్తే గాడిదలచే లాగబడుతున్నబంగారు రంగు గల రథములో రావణుని ఒడిలో వున్నది. అప్పుడు సీత ఇలా వేడుకున్నది. 
 
ఒక్కసారిగా.. ''రామా'' అని అరిచింది. తరువాత "అయ్యో లక్ష్మణా, గొప్ప బాహువులు కలవాడా, పెద్దల మనస్సును ఆనందింపజేయు వాడా, రాక్షసుడు కోపముతో నన్ను అపహరించుకొని పోవుచున్నట్లుగా నీకు తెలియదు కదా!. ధర్మము కొరకు జీవితమును, సుఖమును సంపదలను విడనాడిన రామా! అధర్మాత్ముడైన రావణునిచే అపహరించబడుచున్న నన్ను నీవు చూచుట లేదు. 
 
''అయ్యో! ఈనాటికి కైకేయి కోరిక, ఆమె బంధువుల కోరిక తీరినది. ఎందుకంటే ధర్మపరాయణుడు, కీర్తిశాలి అయిన రాముని ధర్మపత్నియైన నన్ను ఈ రాక్షసుడు హరించుచున్నాడు". (111 49, 24-29) అలాగే అక్కడ వున్న చెట్లకి, పర్వతాలకి, నదులకి, దేవతలకి నమస్కరించింది. తనను రావణుని నుండి కాపాడమని. 
 
చివరకు అరణ్యములో నివసించుచున్న అన్ని ప్రాణులను, మృగములను, పక్షులను కూడా శరణు వేడుకున్నది. ఎవరికైనా సమస్య వస్తే ఇండ్లలో ఎలాగైతే అక్కడవున్న వారిని లేనివారిని, ఎక్కడో వున్న బంధువులను నిందిస్తూ మాట్లాడుతారో అలాగే సీత కూడా రావణుడు ఎత్తుకొని పోతున్నప్పుడు కైకేయిని ఆమె బంధువులను కూడా నిందించింది. 
 
ప్రాణాపాయము కలిగినప్పుడు మానవులు ఎలాగైతే శోకిస్తారో అలాగే సీత కూడా శోకించింది. అన్ని దేవుళ్ళను ఎలాగైతే శరణుకోరుకుంటారో అలాగే పాపం, భయభ్రాంతురాలైన సీత కూడా కనబడిన ప్రతిచెట్టును, కొండను, దేవతను చివరికి జంతువులను కూడా శరణు వేడుకొన్నది. రావణుడు సీతను తీసుకొని వెళుతూ వుండగా మధ్యలో చెట్టుపైన పడుకొని వున్న జటాయువును సీత చూసింది. 
 
''జటాయూ! నా అపహరణమునకు సంబంధించి విషయాలన్నీ పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా రామునకు, లక్ష్మణునకు చెప్పుము'' అని గట్టిగా అరిచింది సీత. సీత ఆర్తధ్వని నిద్రపోతున్న జటాయువునకు వినబడెను. అతడు వెంటనే పరిశీలించగా సీత, రావణుడు కనబడ్డారు. జటాయువు రావణునికి మంగళకరమైన మాటలతో హితవు చెప్పెను. కాని రావణుడు ఆ మాటలను చెవినపెట్టలేదు. జటాయువును చంప ప్రయత్నించెను. రావణునకు, జటాయువునకు మధ్య ఘోర యుద్ధము జరిగెను. ఈ జటాయువు రావణుణ్ణి కాళ్ళ గోళ్ళతో రక్కి, భుజములు ఖండించి, రథమునకు కట్టివున్న గాడిదలను చంపి, రథమును విరిచి భయంకరముగా రావణునితో యుద్ధము చేసెను. చివరికి రావణుని కోపానికి అతని కత్తికి జటాయువు బలిఅయినది. 
 
వాల్మీకి రామాయణములోని అరణ్యకాండలో 54వ సర్గలో వివరించబడిన ప్రకారము సీత ఎంతో సమయస్ఫూర్తి కలిగిన స్త్రీ. సాధారణముగా కష్టాలలో భయానికి గురి అయినప్పుడు బుద్ధి పని చేయదు. నిరాశ చెందుతూ మనసు, శరీరము రెండూ కృశించిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ సీత అంతదుఃఖములో కూడా తన సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. 
 
రావణుడు సీతను ఎత్తుకొని పోతున్నప్పుడు ఆమెకు ఒక పర్వత శిఖరముపైన ఐదుగురు వానరశ్రేష్ఠులు కనబడ్డారు. వాళ్ళు ఎలాగైనా రామునకు తన గురించి చెప్పినా చెప్పవచ్చునని తలంచి తన పట్టు వస్త్రము, ఆభరణములను ఆ వానరుల మధ్య విడిచిపెట్టెను. కాని రావణుడు అది గమనించలేదు. రావణాసురుడు ఏడ్చుచున్న సీతను తీసుకొని, లంకాపురం వైపు వెళ్తున్నది వానరులు గమనించిరి. ఆ విషయమును రామునకు వివరించిరి. అప్పుడే సీత లంకలో వున్న విషయము రామునకు తెలియవచ్చినది. ఇక్కడ సీతయొక్క సమయస్ఫూర్తి వలననే ఆమె ఎక్కడ వున్నది అన్న విషయము తెలిసికొనబడగలిగినది. 
 
సీతను రావణుడు లంకకు తీసుకొనిపోయి అక్కడ రాజభవనంలో పనిచేస్తున్న పరిచారకులను, చూపించాడు. సీత మనస్సు మార్చుకుని తనతో వుంటే ఎన్ని భోగాలను అనుభవించవచ్చునో చెప్పారు. ఇంతవరకు ఏ స్త్రీకి ఇవ్వని ప్రాధాన్యతను సీతకు ఇస్తానని మాట ఇచ్చాడు. అంతట రావణబ్రహ్మ చివరికి సీత కాళ్లను పట్టుకొని దీనంగా వేడుకున్నాడు. కానీ సీత ఎంతమాత్రము చలించలేదు. ''నా భర్త పరాక్రమవంతుడు, ధర్మం తెలిసినవాడు, ఏకపత్నీవ్రతుడు. అతనికి నీకు ఎంతమాత్రము పోలిక లేదు. నా రాముడు వస్తాడు నిన్ను వధిస్తాడు'' అని సీత చెప్పెను.
 
ఆ మాటలు విన్న రావణుడు సీతను అశోకవనములో వుంచి, క్రూరమైన రాక్షస స్త్రీలను కాపాలా పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పరాయివాళ్ళు అక్కడ ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలని కఠినముగా చెప్పెను. సీతకు 12 మాసములు గడువు ఇచ్చెను. మనస్సు మార్చుకుని తనకు భార్యయైనచో సకల భోగములు అనుభవించవచ్చు. లేనిచో సీత శరీరమును ముక్కలుముక్కలుగా ఖండించి వంటవాళ్ళచే వండించి రాక్షసులకు విందుభోజనము చేయిస్తానని బెదిరించెను. కలియుగములో కూడా అపహరించుకుని పోయిన వ్యక్తులకు అలాంటి కష్టాలు పెట్టలేదు. అలాంటి దండన వేయలేదు. 
 
కానీ రావణుడు సీతకు పెట్టిన కష్టాలు తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఏ స్త్రీకి అలాంటి కష్టాలు రాకూడదని కోరుకుంటాము. అన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా సీత రామునిపై నమ్మకముతో వేచివున్నది. సీత ఓర్పు, సహనానికి ఇది ఒక నిదర్శనము. అయితే మారీచుని గావుకేకలు విని, రాముడికి ఆపద కలిగిందేమోనన్న భయంతో లక్ష్మణుడిని చూసి రమ్మని చెప్పినప్పుడు, లక్ష్మణుడు ఏమీకాదూ అతను తిరిగివస్తాడని చెప్పినా, లక్ష్మణుని ఎన్నో విధాలుగా నిందించినప్పుడు ఈ ఓర్పు, సహనం సీతకు లోపించింది. 
 
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే.. అడవిలో తన భర్తయైన రామునకు ఆపద కలిగిందేమోనని భయంతో లక్ష్మణునితో అలా మాట్లాడింది సీత. లంకలో రావణుడు సీతను బంధించినప్పుడు సీత ఆపదలో వున్నది. అంటే సీత, తనకు ఏమైనా ఫరవాలేదు కానీ తన భర్త బాగుండాలి అని కోరుకుంది. ఇప్పటి సమాజంలో కూడా స్త్రీలు, తనకు ఏమైనా ఫరవాలేదు తన భర్త పిల్లలు బాగుంటే చాలు అని అంటూ వుంటారు. అది స్త్రీలకు ఆ బ్రహ్మదేవుడిచ్చిన త్యాగ గుణము. - ఇంకా వుంది. 

వెబ్దునియా పై చదవండి