మనిషి చెప్పే మూడు అబద్ధాలు ఏమిటి?

మంగళవారం, 2 అక్టోబరు 2018 (16:52 IST)
భూమిపై ఆత్మజ్ఞానంతో జన్మించే మనుషులు నిరంతరం మూడు అబద్ధాలు చెబుతుంటారు. ఆ మూడు అబద్ధాలు చెప్పడం మానేస్తేనే వారు నిండుగా జీవించడం సాధ్యంకాదు. శతాబ్దాలుగా తత్వవేత్తలు, ఋషులు, ఇపుడు మానసిక నిపుణులు ఈ విషయాన్ని పదేపదే చెబుతూనే ఉన్నారు. కానీ ఈ మనుషులు మాత్రం ఆ ముగ్గురి మాటలను పట్టించుకోలేదు. ఆ మూడు అబద్ధాలు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
అబద్ధం 1 : 'ఇది నా వల్ల కాదు, ఈ పని నేను చేయలేను'. ఇతరులకు సాధ్యమయ్యే పని తమ వల్ల కాదని తమని తాము నమ్మించుకోడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ 'ఎందుకు కాదు, దీని అంతు చూద్దాం' అనేవారు అరుదు. 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్న మాట గుర్తుంచుకోవాలి. ముందుగా తమ వల్ల కాదనే మాట పక్కన పెట్టాలి. ఇతరులకు సాధ్యమయ్యే పని తనకు కూడా సాధ్యమేనని పట్టుదలతో శ్రమించాలి. తమ వంతు ప్రయత్నం చేయాలి. 
 
అబద్ధం 2 : ప్రతి ఒక్కరు తమకు ఇంకా ఎంతో సమయం వుందని, తమని తాము మోసపుచ్చుకుంటారు. మనిషికి ఉన్నది ఒకే ఒక్క జీవితం. రోజుకు ఉన్నది కేవలం 24 గంటలు. ఈ గంట, ఈ రోజు గడిచిపోయిందంటే మరల రాదు. కనుక వర్తమానం మరిచి భవిష్యత్తు గురించి ఏవేవో ఊహల విహాయాసంలో తిరుగాడటంమానేయాలి. భవిష్యత్తు ఎంతో ఉందనుకుంటూ, రాబోయే కాలాన్ని గురించి ప్రణాళికలు రచిస్తుంటారు. తక్షణ కర్తవ్యాల్ని విస్మరించి గ్యారంటీ లేని భవిష్యత్తు గురించి తలపోస్తారు. ఎంతో సమయం వుంది లెమ్మనే స్వీయ అబద్ధంతో పొద్దుపుచ్చడమే దీనికి మూలం. 
 
అబద్ధం 3 : అంతా తమ దురదృష్టం అని సోమరులు చాలాసార్లు వాపోతుంటారు. ఇది మరో అబద్ధం. ఒక పని చేయడానికి మీరు ఎంతగా శ్రద్ధాసక్తులు చూపుతారన్నది ముఖ్యం. అసలు చొరవ చూపకుండానే దురదృష్టం, తలరాత, విధిరాత అనే మాటలతో సరిపెట్టుకోవడం ఆత్మవంచన. నూటికి నూరుశాతం శ్రమించకుండా అదృష్టం బాగోలేదని వాపోవడం అర్థరహితం. 
 
ఈ విధంగా మూడు అబద్ధాలతో కాలాన్ని దొర్లించేస్తూ, ఏదో ఒక రోజున అనుకోకుండా పశ్చాత్తాపాలతో ఈ లోకం నుంచి నిష్క్రమిస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండివుంటే ఈ స్థితి వచ్చి వుండేది కాదని చింతిస్తుంటారు. 
 
తమలోని శక్తి సామర్థ్యాలని నూటికి నూరుపాళ్ళు ఉపయోగించాలి. వీలైనంత మేరకు ఎక్కువమందికి మేలు చేకూరేలా జీవితాన్ని మలచుకోవాలి. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎంత నిర్దిష్టంగా ఎలాంటి విలువలతో జీవించామన్నదే ప్రధానం. తాము జీవించిన కాలంలో తమ మాట, నడత ఎందరికి ఉపయోగపడుతుందన్నదే ముఖ్యం. దీనిని గుర్తు పెట్టుకుంటే అబద్ధాలతో ఆత్మవంచనతో గడపాల్సిన అగత్యం ఉండదు. ఈ భూమిపై తాము జీవించివున్నా.. లేక వెళ్లిపోయినా 10మంది తమని తలచుకునేలా గడపడమే బతికిన క్షణాలకు ధన్యత. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు