తమిళనాడులోని కడలూర్ జిల్లాలోని చిదంబరం గురించి చెప్పగానే నటరాజ స్వామి గుర్తుకు వస్తారు. చిదంబరం అంటే ఆకాశలింగం. ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం, ఇదీ అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్పటిక లింగరూపం, ఏ రూపం లేని దైవసాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు స్వామి. మూడో రూపమే చిదంబర రహస్యం.
గర్భాలయంలో వెనుక గోడ మీద ఓ చక్రం గీసి వుంటుందట. దాని ముందు బంగారు బిల్వ ఆకులు వేలాడుతుంటాయి. అవేమీ కనిపించకుండా ఓ తెర కట్టి వుంటుంది. అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. భవ అంటే మనసు, ఆ దైవంలో మనసు ఐక్యమయ్యే ప్రదేశం.. అంటే అక్కడ ఏ రూప లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవ సాన్నిథ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం.