'హనుమాన్ చాలీసా' ఎంతో శక్తివంతమైనది... ఎంతంటే....

మంగళవారం, 24 మే 2016 (17:41 IST)
హనుమాన్ చాలీసా... ఎంతో శక్తివంతమైనది. హనుమంతుని ప్రార్థిస్తూ ధ్యానం చేసే ఈ హనుమాన్ చాలీసా ఎంతటి శక్తివంతమైనదో స్వయంగా తులసీదాస్ నిరూపించారు. అప్పట్లో ఓ రోజు ఓ వ్యక్తి మరణించగా అతడిని శ్మశానికి తీసుకెళుతున్నారు. అతడి భార్య బోరున విలపిస్తూ తులసీదాస్ వద్దకెళుతుంది. ఆమెను చూసిన తులసీదాస్ వెంటనే దీర్ఘసుమంగళీభవ అని దీవిస్తాడు. ఐతే తన భర్త మరణించాడనీ, అతడిని శ్మశానానికి తీసుకెళుతున్నట్లు చెపుతుందామె. దానికి తులసీదాస్ చెపుతూ... ఇది రామాజ్ఞ అనీ, నేరుగా వెళ్లి పాడెపై ఉన్న శవం కట్లు విప్పి రామమంత్రం జపించి కమండలంలోని నీరును అతడిపై చిలకరిస్తాడు. ఆ వెంటనే పాడెపై ఉన్న వ్యక్తి ప్రాణంతో లేచి నిలబడతాడు. 
 
ఇది చూసిన ఇతర మతస్థులు సైతం హిందూ మతంలోకి వచ్చేస్తుంటారు. దీన్ని సహించలేని ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను పిలిపించి... ఓ శవం తెప్పించి నీ శక్తిని ఉపయోగించి ఈ శవాన్ని బతికించమంటాడు. ఐతే తులసీదాస్ మాత్రం... అది దేవదేవుడికే సాధ్యమని చెప్పి మౌనం వహిస్తాడు. దీంతో ఆగ్రహం చెందిన పాదుషా అతడిని బంధించాలని ఆజ్ఞాపిస్తాడు. ఇంతలో అక్కడికి భారీగా కోతులు వచ్చి ఆయుధాలను తులసీదాస్ పైన ప్రయోగించకుండా అడ్డుకుంటాయి. ఈ హఠత్పరిణామానికి అంతా భీతిల్లిపోయి తలోదిక్కు పారిపోతారు. 
 
అంతట తులసీదాస్ కళ్లు తెరిచి చూడగా ఎదురుగా హనుమంతుడు ప్రత్యక్షమై ఉంటాడు. దాంతో తులసీదాస్ హనుమంతుని ప్రార్థిస్తాడు. సంతుష్టుడైన ఆంజనేయుడు ఏమి కావాలో కోరుకో అని అడుగుతాడు. తను స్తుతించిన స్తోత్రం లోకకళ్యాణం కొరకు ఉపయోగపడాలని కోరుకుంటాడు. తులసీదాస్ ప్రార్థనతో హనుమంతుడు మరింత సంతుష్టుడై... తులసీ ఈ స్తోత్రం ఎవరు స్తుతించినా వారి రక్షణ బాధ్యత మాదే అని చెపుతాడు. అలా అప్పట్నుంచి హనుమాన్ చాలీసా భక్తుల ఇళ్లలో మార్మోగుతూనే ఉంది.

వెబ్దునియా పై చదవండి