చిన్ని కృష్ణుడు మన్ను తిన్నది 'బ్రహ్మాండ ఘాట్' వద్దనేనట!

సోమవారం, 22 డిశెంబరు 2014 (19:28 IST)
విష్ణువు దశావతారంలో శ్రీకృష్ణావతారానికి ఎంతో ప్రత్యేకత వుంది. పరమాత్ముడు చిన్నికృష్ణుడిగా అవతరించి ఆడిపాడిన ప్రదేశాలు నేటికీ మధుర - బృందావనం పరిసరప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. చిన్నికృష్ణుడి అల్లరి పనులకు ఇక్కడి ప్రదేశాలు వాటిని స్పర్శిస్తూ ప్రవహించే యమునా నది ప్రత్యక్ష సాక్ష్యులుగా కనిపిస్తూ వుంటాయి. అలనాటి విశేషాలను ఆవిష్కరిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ వుంటాయి.
 
ఇక్కడ యమునానదిలోకి దిగి స్నానం చేయడానికి ఏర్పాటు చేయబడిన ప్రదేశాన్ని 'బ్రహ్మాండ ఘాట్' గా పిలుస్తుంటారు. ఈ ప్రదేశం ఒక మనోహరమైన ఘట్టానికి వేదిక. చిన్నికృష్ణుడు మట్టిలో ఆడుకుంటూ ఆ మట్టినే తింటూ వుంటాడు. అది చూసిన బలరాముడు వెంటనే వెళ్లి యశోదాదేవితో చెబుతాడు. మట్టి తినడం వలన అనారోగ్యం కలుగుతుందనే కంగారుతో ఆమె పరుగు పరుగునా అక్కడికి వస్తుంది.
 
తల్లి ఎందుకు వచ్చిందో గ్రహించిన చిన్నికృష్ణుడు చప్పున తన మూతి బిగిస్తాడు. మన్ను తిన్నావా అని అడిగితేలేదని తల అడ్డంగా ఆడిస్తూ వుంటాడు. ఆయన మన్నుతిన్నాడో లేదో తెలుసుకోవడం కోసం నోరు తెరవమని చిరు కోపాన్ని ప్రదర్శిస్తుంది యశోద. భయపడుతూనే కృష్ణుడు నోరు తెరుస్తాడు. ఆ నోట్లో ఆమెకి మచ్చుకైనా మన్ను కనిపించదు. బ్రహ్మాండలోకాలు కనిపిస్తాయి.
 
అది చూసిన యశోదకి కృష్ణుడు బాలుడు కాదు ... పదునాలుగు లోకాలకు అధినాయకుడు అనే విషయం అర్థమవుతుంది. అలాంటి ఆయనని ఆడిపాడించే భాగ్యం తనకి దక్కినందుకు మురిసిపోతూ తన జన్మ ధన్యమైనట్టుగా భావిస్తుంది. అద్భుతమైన ఆ ఘట్టం జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతుంటారు. 
 
ఈ కారణంగానే దీనికి బ్రహ్మాండ ఘాట్ అనే పేరు వచ్చిందని అంటారు. మధుర -బృందావనం వెళ్లిన వాళ్లు తప్పనిసరిగా బ్రాహ్మాండ ఘాట్‌లో స్నానం చేస్తారు. పరమాత్ముడి అనుగ్రహంతో పాపాలు నశించిపోతాయని విశ్వసిస్తుంటారు.

వెబ్దునియా పై చదవండి