బాలాపీర్ బాబా... కాలదేవుడు

సోమవారం, 17 మార్చి 2008 (21:14 IST)
WD
ఏది నిజం శీర్షికలో, ఈసారి మీకు బాలాపీర్ మందిరాన్ని పరిచయం చేస్తున్నాం. బాబా బాలాపీర్ కాలదేవుడని ప్రజల విశ్వాసం. బాబా బాలాపీర్ గుడిలో ఎవరైనా ఏదైనా కోరుకుంటే వారి కోరిక సకాలంలో నెరవేరుతుందని ప్రజల నమ్మకం. బాబా కాలదేవుడు కనుక కోరికలు నెరవేరినప్పుడు భక్తులు తనకు గోడ గడియారాలు, చేతి గడియారాలు మాత్రమే సమర్పిస్తారు. ఈ నమ్మకం గురించి విన్నవెంటనే మేము అహమ్మదాబాద్-ముంబై 8వ నంబర్ హైవేలో నందశేరి గ్రామ సమీపంలో నెలకొని ఉన్న బాలాపీర్ అలయం వైపు బయలుదేరాము.

ఆలయం వద్దకు వెళ్లిన మాకు, బాబాకు గడియారాలు సమర్పించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడ బారులు తీరి కనిపించారు. "బాలాపీర్ బాబాకు గడియారాలను ఎందుకు సమర్పిస్తున్నారు" అని మేం అడిగితే "బాబా మా కోర్కెలు తీర్చార"ని సమాధానం వచ్చింది.

ఈ స్థలాన్ని సంరక్షిస్తున్న హిందూ కుటుంబాల వారు, తన భక్తుల కోర్కెలను బాబా సకాలంలో తీరుస్తున్నారని నమ్ముతున్నారు. ఈ చోటు జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున, చాలామంది ట్రక్కు డ్రైవర్లు కూడా సకాలంలో తాము గమ్యానికి చేరుకోవాలని బాబాను కోరుకుంటూ ఉంటారు కాబోలు.
WD


ఇలా పోగు పడిన గడియారాలను మీరు ఎలా ఉపయోగిస్తుంటారని అడిగాము. ఈ భక్తులలో ఒకరైన లతా బాయి మాట్లాడుతూ, పాఠశాలలు లేదా పెళ్లి ఉత్సవాల్లో ఈ గడియారాలను పంపిణీ చేస్తుంటామని జవాబిచ్చింది. అలా చేస్తే ప్రజలు బాబా బాలాపీర్ దయను పరోక్షంగా పొందుతారన్నమాట. అక్కడే కాస్సేపు ఉండగా ఒకేసారి ఇరవైమందికి పైగా భక్తులు గడియారాలను సమర్పించడం కనిపించింది.

WD
సమయం గురించి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదే కాని, బాలాపీర్‌ బాబాను ప్రార్థిస్తూ లేదా ఆయనకు వాచీలను సమర్పిస్తూ సమయపాలన సాధ్యమవుతుందా... దీన్ని గురించి మీరేమనుకుంటున్నారో రాయండి.... మేం కూడా తదుపరి ప్రయాణం రీత్యా రైలును అందుకోవడానికై స్టేషన్‌కు సకాలంలో చేరుకోవలసిన అవసరం ఉంది కాబట్టి, బాబాకు నమస్కారం చేసి ముందుకు కదిలాము.