రూపం మార్చుకునే వింత పాములు

తన ఆకారాన్ని ఇష్టం వచ్చిన రీతిలో మార్చుకునే నాగ వనితలను మీరు ఇంతవరకు సినిమాల్లో మాత్రమే చూసి ఉంటారు. అయితే ఈ వారం ఏది నిజం కార్యక్రమంలో ప్రియాతిప్రియుడైన భర్తను తిరిగి పొందడానికి భూలోకంలోనే ఆకారం మార్చుకుంటున్న పాము గురించి మీకు పరిచయం చేయబోతున్నాం...

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బాధ్ నగర్‌కు చెందిన మాయా అనే మహిళ తనను తాను రూపం మార్చుకునే పాముగా ప్రకటించుకుంటోంది. ప్రతి 24 గంటలకు ఓసారి తాను పాము రూపంలోకి మారి తన ముగ్గురు సోదరిలను కలుసుకునేందుకు వెళుతుంటానని ఆమె చెబుతోంది. ఎప్పుడో చనిపోయిన తన భర్తను తిరిగి ఎలా పొందడం అనే విషయంపై వారే తనకు సూచిస్తుంటారని చెప్పింది. ఇక్కడ మరో విచిత్రం ఏదంటే మాయా ముగ్గురు సోదరీమణులు కూడా రూపం మారే పాముల బాపతేనట.

చిన్ననాటినుంచే తనకు పెళ్లయిపోయిందని మాయా కలలు కనేది. త్వరలోనే తన భర్తను తిరిగి కలుసుకుంటానని ఆమె నమ్మకం. భూమ్మీద తన కుటుంబంపై ప్రేమానురాగాలకు వశుడై పోయిన భర్త చివరకు తన శక్తులన్నింటినీ పోగొట్టుకున్నాడని మాయా చెబుతుంది.

తన గత జన్మ గురించిన కథను కూడా మాయా ఆసక్తికరంగా చెబుతుంది. ద్వాపర యుగంలో తాను ఒకసారి ప్రమాదవశాత్తూ నీళ్లు పారుతున్న కాలువలో పడిపోయాయని, అప్పుడు ఒక పీర్ బాబా పంపిన గోపాల్ అనే పాము తనను కాపాడిందని ఆమె గమ్మత్తుగా చెబుతుంది. ఈ ఘటన తర్వాత ఇరువురిలో ప్రేమ అంకురించింది. అయితే ఏదో కారణం వల్ల వారు పెళ్లి చేసుకోలేక పోయారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆరోజునుంచి ఆమె తన ప్రియతముడి కోసం వెదుకుతూనే ఉందట.
WD


నాగలోకం గురించి, భూలోకం గురించి వింత కథ చెబుతున్న ఈ రూపం మార్చే సర్ప కన్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాధ్‌నగర్‌లోని పూరి గుడిసెలో నివసిస్తోంది. ఆకారం మార్చే పాము చెబుతున్న కథలతో ప్రభావితమైన స్థానికులు ఆమెను భాగవతీ మాతగా పూజించడం ప్రారంభించారు. మాయాను పూజించడం అనేది ప్రజల భక్తికి సంబంధించిన విషయం కావచ్చు లేదా రూపం మార్చే పామునని చెప్పుకుంటున్న ఆమె మూఢనమ్మకం ఫలితం కావచ్చు కాని ఈ సాంకేతిక యుగంలో ఈ వింత విషయంలో వాస్తవమెంత మరి... ఈ ఉదంతంపై మీ అభిప్రాయాలను మాకు రాయండి.