ఆంజనేయస్వామి వారి మహిమలు....

WD PhotoWD
తీర్థయాత్రలో భాగంగా ఈ వారం మీకు ఓ ప్రత్యేకమైన ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని చూపించబోతున్నాము. ఈ ఆలయం చారిత్రక నగరమైన ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో సాన్వర్ సమీపాన ఉంది. ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ తలక్రిందులుగా ఉండటమే ఈ ఆలయం విశిష్టత. విగ్రహం తలక్రిందులుగా ఉంది కాబట్టే ఈ ఆలయానికి ఉల్టా ఆంజనేయస్వామి ఆలయం అనే పేరు స్థిరపడిపోయింది.

ఈ విగ్రహం ఆంజనేయస్వామి ముఖ భాగాన్ని మాత్రమే కలిగి ఉంది. సాన్వర్ గ్రామ వాసులు ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదని, రామాయణ కాలనుంచి ఇది ఉనికిలో ఉంటోందని చెప్పారు. రామ లక్ష్మణులను అహిరావణుడు బంధించి పాతాళలోకానికి తీసుకుపోయినప్పుడు ఆంజనేయస్వామి పాతాళలోకం వరకు వెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు. హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లిన స్థలం ఇదేనని ఇక్కడి ప్రజల నమ్మకం.

ఈ ఆలయంలోని వీర హనుమాన్ విగ్రహం చాలా శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఆలయం సమీపాన పలువురు మహర్షుల మందిరాలు ఉన్నాయి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఈ మందిరాలు ఉంటున్నట్లు చరిత్ర చెబుతోంది. ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మర్రి, రావి, వేప, పారిజాతం, తులసి చెట్లు ఉన్నాయి. ఇక్కడ రెండు పురాతన పారిజాత వృక్షాలు ఉన్నాయి.

WD PhotoWD
పురాతన గాథల ప్రకారం ఈ చెట్టులో వీర హనుమాన్ కొలువై ఉన్నాడట. ఈ పారిజాత చెట్టుపై లెక్కలేనన్ని చిలుకలు కూర్చుని ఉంటాయి. ఒకానొక బ్రాహ్మణుడు రామచిలుకల రూపంలో అవతారం దాల్చాడని పురాణ గాథ చెబుతోంది. వీర హనుమాన్ చిలుక రూపంలోకి మారి, తులసీదాసు రాముడిని కలిసేందుకు వాహకంగా మారాడని పురాణ కథనం.

ఆలయం లోపల సీతారాములు, లక్ష్మణుడు, శివపార్వతి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి మంగళవారం నారింజ రంగు పూతను ఆంజనేయస్వామి విగ్రహానికి పూస్తారు. ప్రతి మూడు లేదా నాలుగు వారాలకోసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆంజనేయస్వామిపై ప్రగాఢ విశ్వాసం వల్ల ఈ ఉల్టా ఆలయానికి భక్తులు విశేషంగా ఆకర్షితులవుతుంటారు.

ఈ ఆలయానికి చేరుకోవడానికి మార్గాలు:
రోడ్డు మార్గంలో ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో, ఇండోర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ప్రాంతానికి మీరు బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు.
గగన మార్గం : ఈ ఆలయానికి సమీప విమానాశ్రయం 30 కిలోమీటర్ల దూరంలో ఇండోర్‌లో ఉంది.