శ్రీవారి సాధారణ భక్తులకు తితిదే షాక్.. రూ.50 సుదర్శన టిక్కెట్లు రద్దు.. ఏప్రిల్ 1 నుంచే?

గురువారం, 6 ఏప్రియల్ 2017 (09:12 IST)
శ్రీవారి భక్తులకు కష్టాలు తప్పేలా లేవు. ఎన్నో సంవత్సరాల పాటు సాధారణ భక్తులకు అందుబాటులో ఉన్న రూ.50 సుదర్శనం టిక్కెట్లు రద్దయ్యాయి. విడతలవారీగా ఈ టికెట్ల కోటాను తగ్గిస్తూ వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ నెల (ఏప్రిల్) 1 నుంచి పూర్తిస్థాయిలో సుదర్శనం టిక్కెట్లను రద్దు చేసింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే మధ్యతరగతి భక్తులను దృష్టిలో పెట్టుకుని గత ఈవో రమణాచారి రూ.50 సుదర్శన దర్శనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.50 సుదర్శనం టికెట్ల రద్దుతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా.. ఈ-దర్శన కౌంటర్ల ద్వారా టిక్కెట్లను కేటాయించేవారు. ఈ క్రమంలో సుదర్శనం టిక్కెట్లకు కోత విధిస్తూ వచ్చిన తితిదే అధికారులు.. రూ.300 ఆన్‌లైన్ ప్రత్యేక దర్శన విధానానికి శ్రీకారం చుట్టారు. క్యూలైనలో నిరీక్షణ లేకుండా ఇంటర్నెట్‌ ద్వారా బుక్‌ చేసుకున్న సమయాల్లో శ్రీవారిని దర్శించుకునే చర్యలు తీసుకోవడంతోపాటు కోటాను భారీగా పెంచారు. ఈ తరుణంలో రూ.50 సుదర్శన టికెట్ల కేటాయింపు తగ్గుతూ వచ్చింది. 
 
ఆన్‌లైన్ దర్శన విధానానికి మంచి స్పందన లభిస్తుండటంతో సుదర్శన టికెట్లను సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రమే మంజూరు చేయడం ప్రారంభించారు. కానీ ఈ టిక్కెట్లను పూర్తిగా ఈ నెల ఒకటో తేదీ నుంచి పూర్తిగా రద్దు చేశారు. దీనిపై తితిదే ఎలాంటి ప్రకటన చేయలేదు.

వెబ్దునియా పై చదవండి