అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఇక్కడ అరుణాచల కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని కృతికా నక్షత్రం పౌర్ణమినాడు అంగరంగ వైభవంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. సుమారుగా నవంబరు 15 నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం తమిళ క్యాలెండరు ప్రకారం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది ఈ నెల 28న (గురువారం) రాత్రి దుర్గాదేవి ఆలయం తిరువణ్నామలైలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అరుణాచలేశ్వర ఆలయంలో పిడారి అమ్మ ఉత్సవం ప్రారంభం అవుతుంది. శనివారం సాయంత్రం 7 గంటలకు వినాయకుడి ఉత్సవం జరుగుతుంది.
* డిసెంబరు 1న ఆదివారం ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం పంచమూర్తుల ఊరేగింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి అధికార నంది వాహనంపై సోమస్కందమూర్తి మాఢ వీధులలో ఊరేగింపు ప్రారంభం.
* డిసెంబరు 2న ఉదయం సూర్యప్రభ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాఢవీధులలో ఊరేగింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఇంద్ర విమాన వాహనంపై సోమస్కందమూర్తి మాఢ వీధుల్లో ఊరేగుతారు.
* డిసెంబరు 3న భూత వాహనంపై చంద్రశేఖరమూర్తి మాఢవీధులలో ఊరేగింపు సాగుతుంది. అదేరోజు రాత్రి సింహవాహనంపై సోమస్కందమూర్తి మాఢవీధులలో ఊరేగింపు ఉంటుంది.
* డిసెంబరు 4న ఉదయం సర్ప వాహనంపై చంద్రశేఖరమూర్తి మాఢవీధులలో ఊరేగింపు, అదేరోజు రాత్రి కల్పవృక్షం, కామధేను వాహనాలపై సోమస్కందమూర్తి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది.