ప్రవచనకర్త చాగంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇక ఆయన ప్రవచనం చేయారా?

శుక్రవారం, 20 జనవరి 2017 (14:05 IST)
తెలుగు నేలపై తన ప్రవచనాలతో అత్యధిక అభిమానులు సంపాదించుకున్న సుప్రసిద్ధ ప్రవచనకర్త బ్రహ్మాశ్రీ చాగంటి కోటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై తాను ప్రవచనం చెప్పనని నిర్ణయం ప్రకటించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల చాగంటి తన ప్రవచనంలో యాదవ సంఘీయుల మనోభావాలను తదెబ్బ తీసేలా మాట్లాడరని, ఆ సంఘం వారు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. అనేకచోట్ల చాగంటి దిష్టి బొమ్మలను సైతం దగ్ధం చేశారు. దీనిపై చాగంటి స్పందించి తాను శ్రీకృష్ణుని గొప్పతనాన్ని గూర్చి తెల్పే ప్రయత్నంలో భాగంగానే తాను ఆ వాక్యాలు ఉపయోగించానని సంజాయిషీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపర్చారు.
 
స్వతహాగా చాగంటి చాలా సున్నిత స్వాభావులు. గోదావరి పుష్కరాల సమయంలో ఘాట్లలో జరిగిన తొక్కిసలాటకు ఆయనను బాధ్యులను చేస్తూ కొన్ని టివీ ఛానాళ్ళు, మరికొందరు ప్రవచనకర్తలు విమర్శించారు. దీంతో మనస్థాపం చెందిన చాగంటి తదుపరి కృష్ణా పుష్కరాల సమయంలో ప్రవచనం చెప్పకపోవడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జరిగిన రగడతో చాగంటి చాలా మనోవేదనకు గురైనారని, ఈ విషయాన్ని మిగిలిన ప్రవచనకర్తలు ఖండించకపోవడం ఆయనను మరింత బాధించిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 
 
ఈ క్రమంలో చాగంటి వారు ఇక తాను ప్రవచనం చెప్పననే కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారని, దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోవద్దని సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా తీవ్ర ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ఎక్కడ నిజమవుతుందోనని చాగంటి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి