అధికమాసంతో ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనునుంది తిరుమల తిరుపతి దేవస్థానం. సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 18వ తేదీ, శుక్రవారం నుంచి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
19వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం, రాత్రికి పెద్దశేషవాహనంపై స్వామివారు తిరుమాఢ వీధుల్లో ఊరేగుతారు. 20వ తేదీ ఉదయం చిన్న శేషవాహనం, రాత్రికి హంసవాహనం, 21వ తేదీ ఉదయం సింహ వాహనం, రాత్రికి ముత్యపుపందిరి వాహనం, 22వ తేదీ కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనాలపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది.అలాగే 23వ తేదీ ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిస్తారు.
అదేరోజు రాత్రి గరుడ సేవ నిర్వహిస్తారు. 24వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రికి గజవాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. 25వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం, 26న శ్రీవారి రథోత్సవం, రాత్రికి అశ్వవాహనాలపై స్వామివారు తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్నారు. 27వ తేదీ ఉదయం స్వామివారికి వేదపండితులు చక్రస్నానం చేయిస్తారు. అదే రోజు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
కాగా.. ఏటా వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. కరోనా దృష్ట్యా బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతించడం లేదని, స్వామివారి అలంకార సేవలు కూడా ఏకాంతంగా జరుగుతాయని స్పష్టం చేసింది.