శ్రీవారి భక్తులు వచ్చే నెల 7న తిరుమల రావద్దండి... ఎందుకు?

గురువారం, 27 జులై 2017 (14:21 IST)
తిరుమల శ్రీవారి భక్తులు ఆగష్టు 7వ తేదీన తిరుమలకు రాకుంటే మంచిదన్న అభిప్రాయం టిటిడి వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కారణం శ్రీవారి ఆలయాన్ని ఆ రోజు మూసేయనున్నారు కాబట్టి. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఆగస్టు 7న మూసివేయనున్నట్లు తితిదే తెలిపింది. గ్రహణం 7వ తేదీ రాత్రి 10.52 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.48 గంటలకు పూర్తి అవుతుందని టిటిడి అధికారులు తెలిపారు.
 
శ్రీవారి మందిరాన్ని 7న సాయంత్రం 4.30 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటల వరకు మూసివేయనున్నారు.  8వ తేదీ వేకువ జామున ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించనున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల అనంతరం ఉదయం 7 గంటలకు శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించనున్నారు.
 
ఆలయాన్ని తెరిచిన వెంటనే అప్పటికే వేచి ఉన్న భక్తులతో పాటు విఐపిల తాకిడి కలిస్తే సామాన్య భక్తులకు గంటల తరబడి దర్శనం కోసం వేచి వుండాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్న ఉద్దేశంతోనే తితిదే ముందుగానే ప్రకటనలను చేస్తోంది. కానీ భక్తులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా స్వామివారి దర్శనం కోసం ఎంతసేపయినా వేచి చూసేందుకు సిద్థమవుతుంటారు.

వెబ్దునియా పై చదవండి