తిరుమలలో గదుల కేటాయింపు కొత్త విధానం ప్రారంభం.. అయితే?

బుధవారం, 12 జులై 2017 (22:08 IST)
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు గదుల కోసం ఎక్కువసేపు వేచి ఉండకుండా చూసేందుకు, గదుల కేటాయింపులో మరింత పారదర్శకత పెంచేందుకు నూతనంగా టోకెన్‌ మంజూరు విధానాన్ని టిటిడి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం సిఆర్‌వో కార్యాలయంలో 10 కౌంటర్లు, ఎంబిసి-34 వద్ద ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు రెండు స్లాట్లలో గదుల కేటాయింపునకు భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
 
ఈ కౌంటర్ల వద్ద ఆధార్‌ నంబరు ద్వారా భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు వేలిముద్ర వేసి, మొబైల్‌ నంబరును తెలియజేయాలి. ఎ కేటగిరీలో రూ.50/- నుంచి రూ.250/- వరకు అద్దె గల గదులు, బి కేటగిరీలో రూ.500/- నుంచి 1000/- వరకు అద్దె గల గదులు ఉంటాయి. భక్తులు గదుల అద్దె కేటగిరీని తెలపాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత టోకెన్‌ జారీ అవుతుంది. 
 
ఈ టోకెన్‌లో నమోదు సంఖ్య, భక్తుడి పేరు, మొబైల్‌ నంబరు, గది మంజూరు చేసేందుకు పట్టే సమయం తదితర వివరాలు ఉంటాయి. గది మంజూరైన తరువాత సంబంధిత సమాచారాన్ని భక్తుల సెల్‌ నంబరుకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు. అరగంటలోపు భక్తులు అలాట్‌మెంట్‌ కౌంటర్లకు వెళ్లి గదులు పొందాల్సి ఉంటుంది. గదుల అలాట్‌మెంట్‌ కోసం సిఆర్‌వోలో ఏడు కౌంటర్లు, ఎంబిసి-34 వద్ద ఒక కౌంటరు ఏర్పాటుచేశారు. 
 
ఇక్కడ గదుల కేటాయింపు సమాచారాన్ని తెలిపేందుకు డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటుచేశారు. అరగంట లోపు గదులు పొందనిపక్షంలో ఆ తరువాత సీరియల్‌ నంబరు గల భక్తులకు కేటాయిస్తారు. తిరుమల టిటిడి ఉన్నతాధికారులు ఈ విధానాన్ని ప్రారంభించారు. అయితే విధానం ప్రారంభమైన కొద్దిసేపటికే కంప్యూటర్లు మొరాయించాయి. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు. టిటిడి ఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంటకు పైగా కంప్యూటర్లు మొరాయించి ఆ తరువాత పనిచేశాయి.

వెబ్దునియా పై చదవండి