భక్తులకు శుభవార్త, చిత్తూరుజిల్లా ఆలయ విశిష్టతలు సులువుగా తెలుసుకోవచ్చు, ఎలా?

మంగళవారం, 27 జులై 2021 (21:45 IST)
సాధారణంగా పుణ్యక్షేత్రాల సందర్సనకు వచ్చే భక్తులకు ఆలయ ప్రాశస్త్యం గురించి పెద్దగా తెలియకుండా ఉండొచ్చు. అలాంటి వారి కోసం టిటిడి ఒక నిర్ణయం తీసుకుంది. చిత్తూరుజిల్లా ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్సనకు వచ్చే భక్తులకు చుట్టుప్రక్కల ఉన్న ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
స్థానిక ఆలయాల ప్రాశస్త్యాన్ని, స్థల పురాణాన్ని విస్తృత ప్రచారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖలను సమన్వయం చేసుకుని భక్తుల సంఖ్య పెంచేలా ప్రణాళికలు తయారు చేయాలని టిటిడి ఈఓ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు.
 
ఈ సంధర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి స్ధానిక ఆలయాలకు సంబంధించిన స్ధల పురాణం, ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ టిటిడి వెబ్ సైట్‌తో పాటు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ప్రసారం నిర్వహించాలన్నారు. తిరుపతిలోని పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఆలయాల గురించి భక్తులకు తెలిసేలా ప్రచారం ఏర్పాట్లు చేయాలన్నారు. 
 
టూరిజం, ఆర్టీసీ అధికారులతో సంప్రదించి ప్యాకేజీ టూర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే స్థానిక ఆలయాల్లో అవసరాలను బట్టి సేవలు ప్రవేశపెట్టే అవకాశాలు పరిశీలించాలన్నారు. ప్రతి ఆలయానికి సంబంధించి ఒక బుక్ తయారు చేసి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలన్నారు. 
 
అలాగే అప్పలాయగుంట, శ్రీనివాసమంగాపురం ఆలయాల్లో కళ్యాణ కట్టలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి అనుబంధ, విలీన ఆలయాలకు చెందిన వ్యవసాయ భూములు ఖాళీగా ఉంచరాదని ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్డులోని వినాయక ఆలయంలోని సిమెంట్ విగ్రహం స్థానంలో రాతి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఆలయం చుట్టూ పూల మొక్కలు పెంచి భక్తులకు ఆహ్లాద వాతావరణం కల్పించాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు