కాలజ్ఞానం ప్రకారం శ్రీవారి ఆలయం వందేళ్లు వెనక్కి.. ఎవరన్నారు?

శనివారం, 5 ఆగస్టు 2017 (15:18 IST)
దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అన్నో అపరాచారాలపై ఆయన మనసు విప్పి మాట్లాడారు.
 
ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఎన్నో పనులు చేస్తున్నారని, ఎన్నో అపరాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహాలఘు దర్శనం వద్దని చెప్పినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆయన వాపోయారు. అలాగే పవిత్రోత్సవాల్లో విమాన గోపురంపైకి పండితులు కాకుండా మిగతా వారు ఎక్కడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని దీన్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. 
 
అన్నికంటే ప్రధానంగా తిరుమల శ్రీవారిదర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య పతాకస్థాయికి చేరిందని, యుగధర్మం పాటించకపోతే కాలజ్ఞానం ప్రకారం ఆలయం వందేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని దీక్షితులు హెచ్చరించారు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వివరించానన్నారు. 

వెబ్దునియా పై చదవండి