విజయవాడ : కృష్ణా పుష్కరాల సందర్భంగా తిరుమలేశుడి నమూనా దేవాలయం నయనానందకరంగా తయారైంది. ఈ నెల 12 నుంచి పుష్కరాల ప్రారంభం కావడంతో, టీటీడీ విజయవాడలోని పీడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో వెంకన్న నమూనా దేవాలయాన్ని నిర్మించారు. వైభవంగా తయారైన ఈ దేవాలయానికి తిరుమల నుంచి ఉత్సవ విగ్రహాలు ప్రత్యేక రథంలో వచ్చాయి. వీటిని ప్రత్యేకంగా టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, దేవాదాయశాఖ అధికారులు లాంఛనంగా తిరుమల నుంచి సాగనంపారు.
ఇపుడు ఇక్కడ ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి, వైభవంగా కల్యాణోత్సవాలు చేసేందుకు టీటీడీ సిద్ధం అయింది. పుష్కరాలకు వచ్చే లక్షలాది భక్తులు ఈ నమూనా దేవాలయాన్ని సందర్శించాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, నారాయణ తదితర విఐపీలు అంతా తిరుమలేశుడి ఆలయానికి వచ్చి, పూజలు చేసి స్వామి వారికి మొక్కులు చెల్లించి వెళుతున్నారు.