పెరిగిపోతున్న భక్తుల కానుకలు.. రూ.కోట్లు దాటుతున్న శ్రీవారి ఆదాయం

సోమవారం, 23 నవంబరు 2020 (09:27 IST)
తిరుమలలో వెలసివున్న కలియుగ ప్రత్యక్షదేవంగా కోటానుకోట్ల మంది కొలిచే శ్రీవేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం నానాటికీ పెరిగిపోతోంది. కరోనా లాక్డౌన్ తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి తితిదే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇలా కొండపైకి వచ్చే భక్తులు సమర్పించుకునే కానుకలతో హుండీ ఆదాయం పెరిగిపోతోంది. 
 
ఫలితంగా ఆదివారం ఏకంగా రూ.2.26 కోట్లుగా ఉంది. ఆదివారం స్వామివారిని 32,640 మంది భక్తులు దర్శించుకున్నారని, 10,946 మంది తలనీలాలు సమర్పించారని అధికారులు తెరిపారు. ఆలయ పరిధిలో కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నట్టు తెలిపారు.
 
కాగా, రేపు ఉదయం తిరుమలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకునే ఆయన, తొలుత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై మధ్యాహ్నం తిరుమలకు వెళ్లి, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు. కోవింద్ పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు