తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

ఠాగూర్

బుధవారం, 18 డిశెంబరు 2024 (11:28 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో వచ్చే నెల 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం తితిదే ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యతో కలిసి అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
 
ఆ ప్రకారంగా, 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.  24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
 
జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు కేటాయింపు జరుగుతుంది. తిరుపతిలోని ఎం.ఆర్. పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయిస్తారు. 
 
టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్లు లేని భక్తులను దర్శన క్యూలైన్లలోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు ఉంటుంది. 
 
వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుంచి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం • గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు. వైకుంఠ ఏకాదశి రోజున తితిదే సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు