నోట్ల రద్దు సమయంలో 2 వేల రూపాయల కొత్త నోట్లను కోట్ల రూపాయలు మార్పిడి చేసి జైలు పాలయ్యారు టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి. అప్పట్లో శేఖర్ రెడ్డి వ్యవహారం పెద్ద దుమారాన్నే రేగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చిన శేఖర్ రెడ్డి ఆ పరిచయంతోనే టిటిడి పాలకమండలి సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టగలిగాడు. పదవి ఉండగానే ఆయనపై ఆరోపణలు రావడంతో పదవి నుంచి తొలగించారు.
అయితే అప్పట్లో శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు కోట్ల రూపాయల కొత్త నోట్లను గుర్తించారు. ఆ కేసులో శేఖర్ రెడ్డి జైలు శిక్ష అనుభవించగా తాజాగా చెన్నై హైకోర్టులో వచ్చిన తీర్పుతో ఆయన బయటకు వచ్చేశారు. నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శేఖర్ రెడ్డి. అర్థరాత్రి దాటిన తరువాత తిరుమలకు వచ్చిన శేఖర్ రెడ్డి స్వామివారిని దర్శించుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. తనతో పాటు మరో ఇద్దరిని తోడుపెట్టుకుని శేఖర్ రెడ్డి తిరుమలకు వచ్చారు. మీడియాతో మాట్లాడకుండా వద్దువద్దు అంటూ వెళ్ళిపోయారు.