రాజకీయ నేతల కంబధ హస్తాల్లో శ్రీవారి ఆలయం : రమణ దీక్షితులు

బుధవారం, 16 మే 2018 (15:19 IST)
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజకీయ నాయకులే భ్రష్టుపట్టిస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఓ వ్యాపారంగా మార్చుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చెన్నై పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
1996లో శ్రీవారి ఆలయంలో వంశ పారంపర్యం అర్చకత్వాన్ని ప్రభుత్వం ఉన్నపళంగా రద్దు చేసిందని, అందుకు గల కారణాలు తెలియవన్నారు. వంశపారంపర్య అర్ఛకత్వాన్ని రద్దు చేసిన ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అదేసమయంలో అధికారులు కూడా స్వామి వారి కైంకర్యాల్లో తలదూర్చుతున్నారని, ఈ విషయమై అర్చకులను బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. 
 
ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే స్వామి వారి ఆభరణాల వివరాలు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రమణ దీక్షితులు, శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఇచ్చిణ ఆభరణాలు ఎక్కడున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాజకీయ నాయకుల కబంధహస్తాల నుంచి శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు