కళ్యాణం పథకానికి ఆన్‌లైన్‌ ధరఖాస్తులు : తితిదే ఈఓ సాంబశివరావు

శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:41 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలోని కళ్యాణ వేదికపై వివాహం చేసుకునేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను సిద్ధం చేయాలని టిటిడి ఐటీ అధికారులను ఈఓ సాంబశివరావు ఆదేశించారు. మే 9వ తేదీ అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా తిరుమలలో కళ్యాణానికి సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని అంతర్జాలంలో పొందుపరాచాలని సూచించారు. కళ్యాణ పథకంపై తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో అధికారులతో ఈఓ సమావేశమయ్యారు. 
 
దరఖాస్తులలో వివాహం చేసుకునే వధూవరుల వయస్సు, నిర్ధారణకు వారి పాఠశాల ధృవపత్రం పొందుపరచాలన్నారు. అదేవిధంగా ఆధార్‌, రేషన్‌, ఓటర్‌ కార్డులలో ఏదైనా ఒక్కటి తప్పనిసరిగా సమర్పించాలన్నారు. వివాహం సందర్భంగా నూతన వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులను కలిపి మొత్తం ఆరు మందిని శ్రీవారి దర్శనానికి 300 రూపాయల శీఘ్రదర్శనం క్యూలైన్లలో పంపే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీరికి 25 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి రెండు లడ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. 
 
అలాగే వధూవరులకు పసుపు, కుంకుమ, కంకణాలను, చిన్న లడ్డూలతో కూడిన పొట్లం ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కళ్యాణ వేదిక వద్ద బంధుమిత్రుల కోసం హెల్ప్ డెస్క్, కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దరఖాస్తులను అంతర్జాలం, ఈ దర్సన కౌంటర్లు, కళ్యాణ వేదిక వద్ద ప్రత్యక్ష బుకింగ్‌ ద్వారా దరఖాస్తులు పొందుపరచవచ్చని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి