నిజమైన ప్రేముంటే... ప్రేమిస్తూనే ఉండండి

శుక్రవారం, 10 అక్టోబరు 2008 (19:22 IST)
ప్రేమ అనే రెండక్షరాల పదం ఈ జగత్తులో ఓ తరిగిపోని నిధిలాంటింది. శక్తి ఉండి తోడివేస్తే సముద్రం అడుగునైనా చూడొచ్చోమో గానీ ఎన్ని యుగాలు గడిచినా ప్రేమ లోతేంటో మాత్రం ఎవరికీ తెలియదు. అందుకే ప్రేమంటే ఇదేనంటూ ఎందరు నిర్వచించినా ఇంతకు మించి మరేమీ లేదంటూ మరికొందరు తేల్చేసినా ప్రేమలో మునిగినవారు మాత్రం లోతుకు చేరలేక ఒడ్డుకు రాలేక సతమతమవుతుంటారు.

అంతటి మహత్యం ప్రేమలో ఉంది కాబట్టే ప్రేమభావంలో మునిగినవారు ఈ లోకాన్ని సైతం మర్చిపోతుంటారు. తన మనసుకు నచ్చిన చెలి కళ్లముందు ఒక్కసారి కన్పిస్తే ఇక ఆ క్షణం సరికొత్తగా జన్మించి ఆ నెచ్చెలి ప్రేమ కోసం ఏం చేయడానికైనా ఏ తీరం చేరడానికైనా మగవారు సిద్ధమై పోతుంటారు.

అలా అష్టకష్టాలు పడి నచ్చిన చిన్నదాన్ని చేరుకున్నాక... ఆమె మనసును సైతం గెల్చుకుని ఆమెలోనూ ప్రేమభావాన్ని రగిలించాక... ఇన్నాళ్లు తాను పడ్డ తపన ఆమెలోనూ ప్రారంభం అయ్యాక... ఇక మరేమీ లేదన్నట్టు కొందరు అక్కడే నిల్చిపోతుంటారు. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎక్కడా ఆగిపోదు.

ఎగసిపడే కడలి కెరటంలా ప్రేమ సైతం నిత్యం అలా మనసు తీరాన్ని తాకుతూనే ఉంటుంది. అలా తాకే ఆ ప్రేమ తాలూకు ఆ స్పర్శను ప్రేమికులు గుర్తించగల్గితే ఇక వారి జీవితంలో ప్రేమ అనేది ఎప్పటికీ సమసిపోదు. అయితే చాలామంది అబ్బాయిలు ప్రేమ కోసం ఎంతగానో తపిస్తారు. దానికోసం నచ్చిన అమ్మాయి వెంట తిరగడానికి ఏమాత్రం సంకోచించరు.


అయితే చివరకు వీరి ప్రేమలోని తీవ్రతను గమనించి ఆ అమ్మాయి సైతం సరే అందంటే ఇక ఆ క్షణం నుంచే తమ పని అయిపోయినట్టుగా ప్రవర్తిస్తుంటారు. అమ్మాయి తమ ప్రేమకు ఓకే చెప్పేసింది కాబట్టి ఇక అక్కడినుంచి చేయడానికి మరేమీ లేనట్టు ప్రవర్తిస్తుంటారు. కానీ ప్రేమ అనేది ఒకవైపు ఉన్నప్పుడు ఎంత తీవ్రతను కల్గిఉంటుందో అదే తీవ్రత ఇద్దరూ ప్రేమికులుగా మారిన తర్వాత కూడా ఉంటేనే వారి ప్రేమ కలకాలం హాయిగా సాగుతుంది.

అందుకే ప్రేమికులుగా మారాక కూడా తొలి చూపులో తమ ప్రేయసి లేదా ప్రియుడిని ఎంతలా ప్రేమించారో అదే తరహాలో ఎప్పుడూ ప్రేమించగల్గితేనే వారి ప్రేమ కలకాలం ముందుకు సాగగల్గుతుంది. అలా కాకుండా నేనూ నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఎదుటివారు చెప్పేశాక ఇక వారి వెంటపడేందుకు ఏముంది అన్న నిర్లిప్తత గానీ, ఎంతసేపూ ఈ మొహాన్ని ఎలా చూచేది అన్న చులకనభావమో గానీ కల్గిందంటే ఇక వారి ప్రేమ కూడా చులకనై పోతుంది.

అలాంటి ప్రేమ మరికొన్నాళ్లకు పలచనైపోయి చివరకూ ఏమీ లేకుండా పోతుంది. అందుకే ప్రేమ అనే భావం ఇరు హృదయాల్లోనూ అడుగుపెట్టాక కూడా ఎవరైతే తమ ప్రేమలోని నూతనత్వాన్ని అనుభవించగల్గుతారో వారే నిజమైన ప్రేమికులుగా నిల్చిపోతారు.

వెబ్దునియా పై చదవండి