సాధారణంగా మన దేశంలో కొన్ని దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందనే సెంటిమెంట్ ఉంది. కానీ జపాన్‌లో ఒక గుడికి వెళ్లి పూజలు చేస్తే విడాకులు ఖాయమట. విడాకుల కోసమే చాలామంది ఆ దేవాలయాన్ని సందర్శిస్తారట. భక్తులు కోరుకున్న బంధాన్ని తెంచగలిగే ఈ ఆలయం జపాన్‌లోని క్యోటో నగరంలో ఉంది.
జపాన్‌లోని టోక్యో నగరంలో ఉన్న "యాసుయ్ కోన్సేగు" అనే ఆలయానికి ఆధ్యాత్మిక చారిత్ర ఉంది. ఎవరైనా తమ జీవిత భాగస్వామితో విడిపోవాలన్నా లేదా తమ ప్రేమ బంధానికి ముగింపు పలకాలనుకున్నా లేకుంటే ఒప్పందం చేసుకున్న ఉద్యోగం నుంచి వారంతట వారుగా కాకుండా కంపెనీయే వారిని బయటకు పంపాలన్నా, వ్యాపార భాగస్వామితో వ్యాపారాన్ని ముగించాలనుకున్నా ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలట.
ఎటువంటి గొడవలు లేకుండా కోరుకున్న బంధం తెగిపోతుందని ఇక్కడ విశ్వాసం. సాధారణంగా ఇలాంటి బంధాలను తెంచుకోవాలంటే గొడవలు జరగడం, కోర్టు కేసులు ఎదుర్కొనడంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ ఆలయ సందర్శనం ద్వారా ఇలాంటి సమస్యలు ఏవీ ఎదురుకాకుండా సమస్య సామరస్యంగా ముగిసిపోతుందట.
ఈ దేవాలయంలో ఒక పెద్ద బండరాయికి మధ్యలో మనిషి వెళ్లగలిగేంత పెద్ద రంధ్రం ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లిన భక్తులు తాము తెంచుకోవాలనుకుంటున్న బంధాన్ని ఒక కాగితంలో రాసి బండరాయి మధ్యలో ఉన్న రంధ్రం ద్వారా రెండుసార్లు వెళ్లి వచ్చి, బండరాయిపై ఉన్న వస్త్రానికి ఆ కాగితాన్ని కట్టి తాము కోరుకున్న బంధాన్ని తెంచివేయమని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా వారి కోరిక తీరుతుందని జపాన్ వాసుల విశ్వాసం.