ప్రేమలోనూ పరీక్షలు తప్పవు

సోమవారం, 8 సెప్టెంబరు 2008 (16:38 IST)
జీవితంలోని అన్ని బంధాలు లాగానే ప్రేమలోనూ కొన్ని సార్లు పరీక్షలు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరీక్షలకు భయపడిపోయి వెనకడుగు వేసేవారు తమ ప్రేమ బంధానికి ఇక అక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టేయాల్సి వస్తుంది. అయితే ఎవరైతే ఈ పరీక్షలకు ఎదురు నిలబడి పోరాడుతారో వారే చివరకు ప్రేమలో విజయం సాధిస్తారు.

అసలు ప్రేమంటే ఓ అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చామంటూ చెప్పేసుకుంటే పూర్తయ్యే కార్యం కాదు. అసలు తమ మధ్య నిజమైన ప్రేమ ఉందన్న విషయాన్ని వారు నిరూపించుకోవాల్సిందే ఒకరికొకరు నచ్చిన తర్వాతనే. ఎందుకంటే అమ్మాయి, అబ్బాయి ఒకరిని ఒకరు ఇష్టపడితే వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఆ ప్రేమ పరిపూర్ణత సాధించాలంటే మాత్రం వారు జీవితంలో కొన్ని పరీక్షలు ఎదుర్కోక తప్పదు.

కాలం ఎంత ఆధునికత సంతరించుకున్నా చాలావరకు ప్రేమలకు తల్లితండ్రుల ఆమోదం, సమాజ ఆమోదం లభించదు. ఎందుకంటే ఆయా కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ప్రేమికులకు ఎవో కొన్ని సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఇలాంటి సమయంలో ఎవరైతే ప్రేమ కోసం సమస్యలకు ఎదురొడ్డి నిలబడతారో వారే జీవితాంతం తమ ప్రేమను కాపాడుకోగలరు. అలాగే అలాంటివారిలో మాత్రమే నిజమైన ప్రేమ ఉందన్న విషయం కూడా ఎదుటివారికి అర్ధమవుతుంది.

కానీ నేటి కాలమాన పరిస్థితుల్లో చాలామంది చిన్నపాటి సమస్యలకే తమ ప్రేమకు గుడ్‌బై చెప్పేస్తుంటారు. అసలు అలాంటి వారికి సమస్య అన్నది కేవలం కారణం మాత్రమే. సమస్యను కారణంగా చూపించి తాము అంతకాలం సాగించిన ప్రేమ? బంధాన్ని వదిలించుకోవాలని అలాంటివారు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటివారు అసలు సమస్యలేమీ రాకపోయినా సరే తమ ప్రేమకు ఏమాత్రం కట్టుబడి ఉండరు.


వీరి దృష్టిలో ప్రేమ అన్నది కేవలం ఆకర్షణ మాత్రమే. ఆకర్షణ అనేది తీరగానే వీరి దృష్టిలో ప్రేమ వ్యవహారం ఓ పనికిమాలినదిగా కన్పిస్తుంది. అయితే ఎలాంటి కాలమాన పరిస్థితుల్లో అయినా సరే ప్రేమ అనే బంధం ఏర్పడిన తర్వాత దానిని జీవితాంతం కాపాడుకోవాలని, ప్రేమ బంధాన్ని జీవనబంధంగా మార్చుకోవాలని ప్రయత్నించేవారు ఉంటూనే ఉంటారు.

అలాంటివారు ప్రేమ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైన భయపడిపోకుండా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా తమ ప్రేమలో ఏర్పడిన చిక్కుల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించేవారు చాలావరకు అంతిమంగా విజయం సాధించితీరుతారు. అసలు ప్రేమ అంటేనే కాస్తో కూస్తో సమస్యలు లేకుండా విజయం వరించదు. ప్రేమలో అడుగుపెట్టిన ప్రతివారికీ ఇది అనుభవమే.

అయితే ప్రేమలో నిజాయితీ, ఒకరిపట్ల ఒకరికి విడదీయలేని అనుబంధం ఉన్నవారు మాత్రమే తమ ప్రేమను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటివారు మాత్రమే అంతిమంగా ప్రేమలో విజయం సాధిస్తారు.

వెబ్దునియా పై చదవండి