మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్‌గేట్స్ శకం ముగుస్తోందా..? అవునని గణాంకాలు చెబుతున్నాయి. 13 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా వెలుగొందిన బిల్‌గేట్స్ 2008లో తన స్థానాన్ని చేజార్చుకోవడం విశేషం. అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ గురుగా పేరొందిన వారెన్ బఫెట్ ఈసారి మాత్రం గేట్స్‌ను తోసిరాజని అత్యంత సంపన్న జాబితాలో తొలి స్థానం చేజిక్కించుకున్నారు,.
అమెరికాలోని నెబ్రాస్కాకు చెందిన వారెన్ బఫెట్ సంపద 2007-08లో 10 బిలియన్ డాలర్లకు పెరిగి 62 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఫోర్బ్స్ పత్రిక ఏటా ప్రచురించే ప్రపంచ బిలియనీర్ల జాబితాలో బఫెట్ అగ్రస్థానంలో నిలిచారు. గత 13 ఏళ్లుగా ఫోర్బ్స్ జాబితాలో ప్రథముడిగా నిలిచిన బిల్ గేట్స్ 2008లో మొదటిసారిగా మూడో స్థానానికి పడిపోయారు.
దీంతో బిల్ గేట్స్ సంపద 58 బిలియన్ డాలర్లకు పడిపోయింది. మెక్సికన్ టెలికామ్ టైకూన్ కార్లోస్ స్లిమ్ 60 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో రెండో స్థానం చేజిక్కించుకున్నారు. బ్రిటన్‌లో కెల్లా సంపన్నుడిగా గుర్తింపు పొందిన ప్రవాస భారతీయుడు లక్ష్మీ మిట్టల్ నాలుగా స్థానం పొందారు. బ్రిటన్‌లో నివసిస్తున్న మిట్టల్ సంబద 49 బిలియన్లకు చేరింది.
2008 ఫోర్బ్స్ జాబితాలో 1,125 మంది బిలయనీర్లు చోటు సంపాదించగా వీరి మొత్తం సంపద 4.4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. భారీ స్థాయిలో చారిటబల్ బహుమతులను పొందిన వారెన్ బఫెట్ ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో తోడ్పడేందుకు గాను తన సంపదలో 31 బిలియన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తానని చెప్పారు. ఈ ఏడాది జూలైలో రెండవ విడతగా 1.76 బిలియన్ల విలువ చేసే షేర్లను గేట్స్ ఫౌండేషన్ పరం చేశారు.
13 ఏళ్ల వయసునుంచే పన్ను కట్టనారంభించిన బఫెట్ సైకిల్ కొన్నందుకు గాను 35 డాలర్ల పన్ను మినహాయింపు పొందారు. ఇన్వెస్ట్‌మెంట్ గురు అయిన బెంజిమన్ గ్రాహమ్ పర్యవేక్షణలో న్యూయార్క్ లోని కొలంబియా బిజినెస్ స్కూల్‌లో ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేశారు.
వారెన్ 1962లో బెర్క్‌షైర్ హాత్‌వే వస్త్ర ఉత్పత్తి సంస్థకు చెందిన షేర్లను కొనడం ద్వారా తొలిసారిగా షేర్ మార్కెట్లోకి అడుగు పెట్టారు. బఫెట్ అధ్వర్యంలోని బెర్క్ షైర్ తర్వాత ఫైనాన్షియల్ సేవలలోకి అడుగుపెట్టడమేకాక, కోకా కోలా, పి అండ్ జి, జిఇ తదితర బ్లూచిప్ కంపెనీలలో షేర్లను కలిగి ఉన్నారు. ప్రస్తుతం బెర్క్ షైర్ షేర్ విలువ షేర్ ఒక్కింటికి 150,000 డాలర్లతో రికార్డు సృష్టిస్తోంది.
ఫోర్బ్స్ జాబితాలో లక్ష్మీ మిట్టల్, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రియాల్టీ వ్యాపారి కెపి సింగ్‌లు టాప్ టెన్‌లో చోటు సంపాదించారు. గత సంవత్సరం ఈ జాబితాలో టాప్ టెన్‌లో మిట్టల్ ఒక్కరే ఉండటం గమనార్హం. ఫోర్బ్స్ జాబితాలో 53 మంది భారతీయులు చోటు సంపాదించుకోగా ఆసియాలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో చేరిన భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద 340.9 బిలియన్ డాలర్లకు చేరింది.