భారత్‌లో సరికొత్త క్రీడా సంచలనం: ఐపిఎల్

సోమవారం, 29 డిశెంబరు 2008 (16:58 IST)
ప్రపంచ క్రికెట్ రంగంలో ప్రభంజనంలా తలెత్తిన ట్వంటీ20 క్రికెట్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను క్యాష్ చేసుకునే క్రమంలో బిసిసిఐ 2008లో ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రారంభించినది మొదలుగా భారతీయ క్రీడా చరిత్రలోనే కాదు.. ప్రపంచ క్రీడా యవనికలో కూడా అరుదుగా జరిగే అద్భుతాలకు ఐపిఎల్ వేదికైంది.

ఐపిఎల్‌లో ప్రకటించిన 8 ట్వంటీ20 ప్రీమియర్ లీగ్ టీముల యాజమాన్య హక్కుల కోసం భారతీయ కార్పొరేట్ సంస్థలు, సినీ తారలు పోటీపడిన తీరు మొత్తం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతిపర్చింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చండీఘర్, చెన్నయ్, ఢిల్లీ, జైపూర్, కొల్‌కతా నగరాల్లోని ఫ్రాంచైజ్‌లు పదేళ్లపాటు ఐపిఎల్ టీముల యాజమాన్య హక్కులను కొనుగోలు చేసేందుకోసం పోటీలు పడ్డారు.

ఇండియన్ క్రికెట్ లీగ్ -ఐసిఎల్-కు ప్రత్యక్ష పోటీదారుగా బిసిసిఐ ప్రారంభించిన ఈ టోర్నీలో ఫ్రాంచైజ్‌లుగా ముంబై సినీ తారలు షారుఖ్‌ఖాన్, జుహీ చావ్లా, ప్రీతీ జింటాలు బరిలో దిగారంటే ఈ టోర్నీ కలిగించిన ప్రభావం స్థాయిని అంచనా వేయవచ్చు. ఒక్కో టీము కొనుగోలుకు గాను 50 మిలియన్ డాలర్ల రిజర్వ్ ధరను నిర్ణయించగా అంతకు మించిన అనూహ్య మొత్తాలకు టీములను వేలంపాటలో పాడి క్రీడాభిమానులను ఆశ్చర్యపరిచారు.

ఐపిఎల్‌లోని మొత్తం 8 టీములకు గాను ఫ్రాంచైజ్ యజమానులు 6996 కోట్ల రూపాయలను (1.749 బిలియన్ డాలర్లు) ఫణంగా పెట్టి కొనుగోలు చేశారు. భారతీయ కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ ముంబై టీముకు అత్యధిక బిడ్ దాఖలు చేసి కొన్నారు. ఈ టీమ్‌లో సచిన్ ఆడుతుండటంతో వేలంలో ముంబై టీమ్ విలువ అమాంతంగా పెరిగిపోయింది.

కొనుగోళ్ల వివరాలు

ముంబై టీమ్ - రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ - 111.9 మిలియన్ డాలర్లు
బెంగళూర్ టీమ్ - యుబి గ్రూప్ ఛైర్మన్ విజయ మాల్యా - 111.6 మిలియన్లు
కొల్‌కతా టీమ్ - ఎస్ఆర్‌కె రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ - 75 మిలియన్లు
చండీఘర్ టీమ్ ప్రాంచైజ్ - ప్రీతి జింటా, నెస్ వాడియా, కరణ్ పాల్, మోహిత్ బర్మన్ - 75 మిలియన్లు.
హైదరాబాద్ - డెక్కన్ క్రానికల్ - 107.01 మిలియన్ డాలర్లు
ఢిల్లీ టీమ్ - జిఎమ్ఆర్ - 84 మిలియన్లు
చెన్నై టీమ్ - ఇండియా సిమెంట్స్ - 91 మిలియన్లు
జైపూర్ ప్రాంచైజ్ - ఎమర్జింగ్ మీడియా 67 మిలియన్లు

ఐపిఎల్ టోర్నీ ఫ్రాంచైజ్ యజమానుల ఖర్చుల్లో దాదాపు 60-65 శాతం మేరకు టెలివిజన్ ప్రసార హక్కుల రూపంలో లభిస్తున్నాయి. సోనీ వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ 1.026 బిలియన్ డాలర్లతో ప్రసార హక్కులను కొనగా, బిసిసిఐ తన వంతుగా 108 మిలియన్ డాలర్లకు ప్రసార హక్కులను కొనింది. క్రికెట్ జవజీవాలకు తిరుగులేని తార్కాణంగా ఐపిఎల్ మారింది.

ఆధునిక క్రికెట్‌లో కనీ వినీ ఎరుగని ఆదాయ మార్గాన్ని చూపిన చరిత్రను ఐపిఎల్ తన సొంతం చేసుకుంది. ఒక దెబ్బతో, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ వంటి ప్రపంచంలోనే అతి సంపన్న క్రీడా లీగ్‌ల సరసన ఐపిఎల్ నిలిచింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో రికీ పాంటింగ్, కుమార్ సంగాక్కర, సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్, గ్లెన్ మెగ్రాత్ వంటి దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొన్నారు. 2008 ఏప్రిల్ 18న ప్రారంభమైన ఐపిఎల్ 44 రోజుల పాటు కొనసాగి 59 మ్యాచ్‌లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

తమ బ్రాండ్‌లకు ప్రచారం పొందాలనుకునే మార్కెట్‌దార్లకు క్రికెట్ ఇప్పటికీ మంచి వనరేనని ఐపిల్ మరోసారి చాటింది. ఒక్క ఫ్రాంచైజ్ బిడ్ ద్వారానే 724 మిలియన్ డాలర్లను పొందిన బోర్డు మీడియానుంచి మరికొంత సొమ్ము చేసుకుంది. దీంతో ప్రారంభం కాకముందే ఐపిఎల్ దాదాపు 7 వేల కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుంది. టైటిల్ బిడ్లు, షర్ట్ స్పాన్సర్‌షిప్స్ వంటివాటిని కలుపుకుంటే వచ్చే ఆదాయాన్ని అంచనాలను మించిపోయింది.

వీటికి తోడు ప్రాంచైజ్‌లు టిక్కెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నూటికి నూరు శాతం హక్కు భుక్తం చేసుకున్నారు. ఇక లైసెన్సింగ్, మర్కండైజింగ్ కార్యకలాపాలు ఐపిఎల్ ఫ్రాంచైజ్‌లకు పది సంవత్సరాలపాటు బోలెడు ఆదాయ వనరును చూపించనున్నాయి మరి. ఈ ఒక్క ఖాతాయే యూరోపియన్ యూనియన్ ఫుట్‌బాల్ క్లబ్స్ మొత్తం ఆదాయంలో పదోవంతు ఆదాయాన్ని ఫ్రాంచైజ్‌లకు అందించనుంది.

ఇవన్నీ ఒకెత్తు కాగా ఐపిల్ లీగ్ పోటీలు ప్రారంభమైన తర్వాతి పరిణామాలు మరొకెత్తుగా మారాయి. 44 రోజల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఐపిఎల్ భారతీయ టీవీ ఛానెళ్ల ముందు ప్రేక్షకులను కట్టి పడేశాయంటే అతిశయోక్తి కాదు. సాంయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు 44 రోజుల పాటు భారత జాతి పనులు మాని ఇంట్లో టీవీల ముందు కూర్చుండిపోయింది. బంతి బంతికీ, పరుగు పరుగుకూ చీర్ గరల్స్ నృత్యాలతో ఐపిఎల్ విదేశీ పోకడలు కూడా పోయింది.

భారతీయ వినోద పరిశ్రమను పక్కన బెట్టి, జనాలను మొత్తంగా తనవైపుకు లాక్కున్న ఐపిఎల్ క్రీడా చరిత్రలో పెను సంచలనంగా మారింది.

వెబ్దునియా పై చదవండి