'రంగుల' లోకంలో 'మాయ'మవుతున్న 'తార'లు

PNR

FileFILE
సినిమా రంగం ఆధునిక ప్రపంచంలో పేరుప్రఖ్యాతలకు పెట్టింది పేరు. డబ్బుకు డబ్బు. పేరుకు పేరు ఏకకాలంలో తెచ్చిపెట్టే రంగం. అందుకే నేటి యువతీ యువకులు రంగుల లోకంలో విహరించేందుకు పరుగులు తీస్తున్నారు. తమ కలలను సాకారం చేసుకోవాలని ఆతృత చెందుతున్నారు. కోరికలు నెరవేర్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆ కష్టాల్లో తమ ప్రాణాలను తృణ ప్రాయంగా పోగొట్టుకుంటున్నారు.

రంగవల్లుల లోకం కొత్త పుంతలు తొక్కుతోంది. బుల్లితెర/వెండితెరపై తమను తాము చూసుకుని మురిసి పోయేందుకు పోటీ పడుతున్నారు. ఎన్నో ఆశలతో రాజధానిలో అడుగుపెడుతున్నారు. చిన్నపాటి అవకాశాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అవకాశం లభించగానే తమ ప్రతిభను నిరూపించుకుంటూ.. ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఈ కాలక్రమంలో చేయరాని తప్పులు చేస్తున్నారు. ఇలాంటి చిన్నచిన్న తప్పులకు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

ఈ కోవలో నేటి భార్గవి (అష్టాచెమ్మా ఫేం) మొదలుకుని.. శోభ, దివ్యభారతి, సిల్క్‌స్మిత, అలేఖ్య, కునాల్ సింగ్, లీలారాణి, విజయశ్రీ, మధుమాలిని, బుల్లితెర యాంకర్ లక్ష్మీ సుజాత వరకు చిన్నపాటి అపార్థాలతో తనవు చాలించగా, మరికొందరు హత్యకు గురయ్యారు. ఇలాంటి వారి విషయాల్లో అపార్థాలు, అసూయ, ప్రేమ లాంటి అంశాలు కారణభూతంగా నిలిచాయి. అయితే.. ఆర్తీ అగర్వాల్, ఉదయభాను వంటి నటీమణులు చివరి నిమిషంలో ప్రాణగండం నుంచి బయటపడిన సంఘటనలూ ఉన్నాయి.

సంచలనం సృష్టించిన ప్రత్యూష హత్య..
2002లో జరిగిన నటి ప్రత్యూష హత్య రాష్ట్రంలోనే కాకుండా.. అటు తమిళనాడులోనూ పెద్ద సంచలనమే సృష్టించింది. ఇరు భాషల్లో మంచి అవకాశాలు చేజిక్కించుకుంటూ తారాపథంలో దూసుకెళ్లుతున్న సమయంలో హత్యకు గురైంది. తన స్నేహితుడి సిద్ధార్థ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకోవడమే ప్రత్యూష చేసిన తప్పు.

FileFILE
ఫలితంగా ప్రత్యూష-సిద్ధార్థ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే.. టీవీ యాంకర్ లక్ష్మీ సుజాత హత్య. ఇది కూడా రాష్ట్రంలో పెను దుమారే రేపింది. కేవలం ప్రేమించలేదన్న కారణంతో మేకప్‌మేన్ చంద్రశేఖర్, తన స్నేహితునితో కలిసి లక్ష్మీ సుజాతపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఇలా ఒక్కో హీరోయిన్‌ ఏదో ఒక కారణంతో హత్యకు గురయ్యారు.

ఇదే కోవలో 'అష్టాచెమ్మా' భార్గవి
ఆర్కెస్ట్రా కళాకారిణిగా పరిచయమైన భార్గవి.. తన పరిచయాలు, చనువు, ప్రతిభతో సినీ అవకాశాన్ని చేజిక్కించుకుంది. తన తొలి చిత్రంలోనే మంచి నటనతో చిత్ర ప్రముఖుల ప్రశంసలు అందుకున్న భార్గవి.. అకస్మాత్తుగా నేలరాలి పోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, శ్రీవెంకటేశ్వర నగర్ బస్తీలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో భార్గవి శవమై తేలడం మిస్టరీగా మారింది. ఆమె శవం పక్కనే, భర్తగా భావిస్తున్న (పేర్కొంటున్న) ప్రవీణ్ కుమార్ కూడా శవంగా పడివుండటం ఈ కేసు మరింత మిస్టరీగా మారింది.

ఈ హత్యలు.. ఆత్మహత్యలకు కారణం...?
ఎన్నో కలలతో రంగుల లోకంలోకి వచ్చే వర్ధమాన కళాకారులకు ఒక్కసారి గుర్తింపు, పేరు, డబ్బు రావడంతో పరిస్థితి మారిపోతోంది. దీనివల్ల అంతకుముందు సన్నిహితంగా ఉండే స్నేహితులతో సత్‌సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా.. స్నేహితుల్లో అసూయ, ద్వేషం పెరిగి పోతున్నాయి. నిన్నటి వరకు ఎంతో చనువుగా ఉండిన అమ్మాయి.. ఒక్కసారి తననుంచి దూరం కావడాన్ని జీర్ణించుకోలేని యువకులు/వ్యక్తులు ఎలాంటి అఘాయిత్యానికైనా ఒడిగట్టేందుకు వెనుకంజ వేయడం లేదు.

మరణించిన సినీ యువతుల కేసులన్నింటిని నిశితంగా పరిశీలించగా ఇదే విషయం తేటతెల్లం అవుతోంది. తమ కెరీర్, సినిమాల బిజీలో పడి బంధువులు, స్నేహితులను పట్టించుకోక పోవడం వల్లే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణమని పోలీసు అధికారులతో పాటు మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.