హాస్య చిత్రాలకే ప్రేక్షకుల ఓటు...

WD

బ్రహ్మానందం కామెడీకే మంచి స్పందన...

గత సంవత్సరంతో పోలిస్తే 2008 సంవత్సరం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అనుకూలించిందనే చెప్పాలి. నిజానికి ఈసారి కూడా చాలా చిత్రాలు ప్లాపుల ముద్ర వేయించుకున్నప్పటికీ చిన్న చిత్రాల హిట్ల సంఖ్య జోరు వాటిని మరచిపోయేలా చేసింది. ప్రజలను థియేటర్ వైపు రప్పించేలా కామెడీ చిత్రాలు ప్రయత్నించాయి.

ఇతివృత్తం, టెక్నిక్, బడ్జెట్ విషయాలను తీసుకుంటే రకరకాల చిత్రాలు రూపొందినా అగ్రహీరోలకు విజయం అందని ద్రాక్షలా తయారైంది. సక్సెస్ కోసం హీరోలు సిక్స్‌ప్యాక్‌తో రకరకాల విన్యాసాలు చేసినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఏడాది ప్రారంభమే సంక్రాంతితో బాలయ్య చిత్రం విడుదలై బాక్సాఫీస్‌వద్ద బోల్తాపడింది. మరో చిత్రం కృష్ణకు కాస్త ఊరటనిచ్చింది.

ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద దాదాపు 138 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 120 సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందులో అగ్రహీలో చిత్రాలు వేళ్ళలో లెక్కించేవి 4, 5 మాత్రమే ఉన్నాయి. ఇన్ని సినిమాలు ప్లాపయినా ఈ ఏడాది చిన్న చిత్రాలకు అనుకూలించిందనే ఇండస్ట్రీ భావిస్తోంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈ ఏడాది అవే ఎక్కువగా విజయం సాధించాయి.

WD

ఎన్నో సాహస ఘట్టాలు...


రక్తం, శృంగారం, వ్యాపారం అంశాలుగా హాలీవుడ్ చిత్రాలు ఆస్కార్ బరిలో ఉంటే... వర్తమాన సమాజం పరిస్థితుల్లో మన చిత్రాలు ముందు వరుసలో ఉన్నాయి. జాతీయ స్థాయి చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాకు సముచితమైన స్థానమే దక్కింది. "హోప్" జాతీయ స్థాయిలో సామాజిక స్పృహ కలిగిన ఉత్తమ చిత్రంగా నిలిచింది.

లంబాడీల జీవన నేపథ్యంలో సాగిన "కమ్లి" ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ దఫాయే మొదలైన యానిమేషన్ విభాగంలో "కిట్టు" విజేత అయింది. ఇక తెలుగు భాషకు జాతీయ హోదా కల్పించడం మన ప్రత్యేకతని ఇండస్ట్రీ భావించినా, అది కార్యరూపంలోకి వచ్చేసరికి చిత్ర టైటిల్స్‌లోనూ ఏమాత్రం లేకపోవడం విచారకరం.

మెగా రాజకీయ ప్రవేశం... సహనటులనుంచి విమర్శనాస్త్రాలు...

పవన్‌కళ్యాణ్‌కు బహు భార్యత్వం కేసులో క్లీన్ చిట్ ఇచ్చి కోర్టు కొట్టేసింది. ఏడాది అయినా ఒక్క చిత్రం కూడా చేయలేకపోయాడు. "కొమురం పులి" అనే పేరుతో ఓ చిత్రాన్ని ప్రస్తుతం చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినీరంగాన్ని వదిలేసి రాజకీయరంగానికి రావడం ఈ ఏడాది ప్రత్యేకత. దాంతో చిరంజీవి సహనటీనటుల విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బ్లడ్‌బ్యాంక్ అనేది వ్యాపారం కోసమే చేస్తున్నాడని వారి ఆరోపణ. రోజా, విజయశాంతి, చోటామోటా నటీనటులు కూడా మెగాపై విమర్శలు కురిపించిన వారిలో ఉన్నారు.

ఇక మహేష్ బాబు ఈ ఏడాది ఏ చిత్రాన్ని చేయలేదు. కాకపోతే వార్నర్ బ్రదర్స్ వంటి సంస్థ ఓ చిత్రాన్ని చేయనుందనే సమాచారం ఈ ఏడాది ప్రత్యేకత. ఇక చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజ తొలి చిత్రం "చిరుత" హీరోయిన్ నేహాశర్మతో ఆల్‌రెడీ పెండ్లి అయిందనే వార్తలతో మీడియానంతా ఎయిర్‌పోర్ట్ వరకు లాక్కొచ్చారు. తీరా అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు.

ఇక హాస్యనటులు మల్లికార్జునరావు, కల్పనారాయ్, లక్ష్మీపతి, చిత్ర నిర్మాత రామారావు, విలక్షణ నటుడు రఘువరన్ వంటివారు చనిపోవడం చలన చిత్ర రంగాన్ని విషాదంలో ముంచెత్తింది. మరోవైపు "సిద్ధు" చిత్రానికి కాల్షీషీట్స్ ఇవ్వడంలేదని ప్రసాద్ అనే నిర్మాత ప్రకాష్‌రాజ్‌పై నిర్మాతల మండలి ద్వారా చర్యలు తీసుకున్నారు. ఆయనకు ఎవరూ సహకారం అందించకూడదని ఛాంబర్ నిర్ణయించింది. కానీ కొద్దికాలానికే దిల్‌రాజు, నల్లమలపుబుజ్జి వంటి నిర్మాతలు తమ చిత్రాలకు అడ్డంకిగా ఉందని మాఫీ చేయించారు.

WD

మత్తెక్కించే అభినయాలకు కథానాయికల ప్రాధాన్యం....

"అందమైన మనసులో" చిత్రం ద్వారా నటుడు గిరిబాబు దర్శకుడిగా మారినా ఫలితంలేకపోయింది. "మీ శ్రేయోభిలాషి", సంభాషణలు, "హ్యాపీడేస్" చిత్రం కామిక్స్ బుక్స్ విడుదల కావడం చిత్రరంగంలో చాలాకాలం తర్వాత ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. హీరోయిన్లు ఛార్మి, కామ్నాజెఠ్మలానీ వంటి వారు ఐటంసాంగ్స్‌లో నటించడం, ఎన్టీఆర్, వేణు, పవన్ కళ్యాణ్ వంటి వారు వేరొకరి చిత్రాల్లో పాటల్లో ప్రత్యక్షమవడం మరో విశేషం.

శాటిలైట్ సంప్:
ప్రస్తుతం సినిమా వ్యాపారంలో శాటిలైట్ రైట్స్ ద్వారానే నిర్మాతకు ఎక్కువ మొత్తం అందుతోంది. సినిమా ప్రారంభం అయ్యాక తొలి వ్యాపారం ఇదే. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంక్షోభం ఎంటర్‌టైన్ ఛానెల్స్‌మీ కూడా పడింది. దాంతో అంతకుముందు బాగానే ఉన్న ఈ వ్యాపారం ఆర్థిక సంక్షోభం తర్వాత ఏ నిర్మాతను అడిగినా ఇంకా శాటిలైట్ వ్యాపారం కాలేదని, చాలా తక్కువగా అడుగుతున్నారని అంటున్నారు. దీంతో నిర్మాణ పరంగా కొన్ని సమస్యలు నిర్మాతలు ఎదుర్కొంటున్నారు.