తెలుగువారు అత్యంత వైభవంగా పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి. ఈ పండుగలో మొదటిరోజును భోగి పండుగగా జరుపుకుంటారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు.
భోగి మంటలు వేయడంలో కొన్ని సైన్సుకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. ఈ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది.
భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం.
అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.
భోగిమంటలకు ఎక్కువగా గ్రామీణులు తాటి ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు. ఈ పండుగనాడు ఆంధ్రులు కొత్తబట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది.
తెల్లవారుజామున భోగిమంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దలు భోగిమంటల సెగతో కాచుకున్న వేడినీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు. పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గువేయడం కొంచెం కష్టంతో కూడుకొన్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.