కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి, మెడలో గజ్జెల పట్టీ, కాళ్ళకు మువ్వలు వేస్తారు. ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక, వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ పండుగ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు.
పిండి వంటలతో సంక్రాంతి మంచి విందును ఇస్తే, కనుమ పండుగ మసాలా ఘుమఘుమలతో మైమరపిస్తుంది. ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవని అంటారు. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు అంటారు. తెలుగు రాష్ట్రాలలో కనుమ నాడు ప్రయాణం చేయకూడదని అంటారు. కనీసం ఊరి పొలిమేర కూడా దాటకూడదని అంటారు.