అకాడమీ విషయంపై పునరాలోచించాలి : సైనా

మంగళవారం, 30 సెప్టెంబరు 2008 (12:38 IST)
తన కోచ్ గోపీచంద్‌కు ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకోవాలనే ఆలోచనను పునరాలోచించాలని భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం సైనా నెహ్వాల్ పేర్కొంది. అకాడమీ కోసం కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం తనకు చాలా బాధ కల్గించిందని ఆమె వ్యాఖ్యానించింది.

చైనా పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న సందర్భంగా సైనా మీడియాతో మాట్లడుతూ గోపీచంద్ అకాడమీకి ఇచ్చిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకోవాలనుకోవడం సరికాదని తెలిపింది. అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారుల ప్రదర్శన, వారి విజయాలను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

బ్యాడ్మింటన్ అకాడమీ అంటే పూర్తిగా ఆటకు సంబంధించిన శిక్షణ మాత్రమే కాదని మిగతా విషయాలపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా చైనాలో తన పర్యటన విశేషాల గురించి ఆమె మాట్లాడుతూ చైనీస్ తైపీ విజయం అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది.

అదే సమయంలో సూపర్ సిరీస్‌లో సెమీస్ స్థాయిలో ఓటమి చెందడం నిరాశ కల్గించినా మొత్తం మీద పర్యటన మాత్రం పూర్తి సంతృప్తినిచ్చిందని సైనా పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి