అకాడమీ స్థల వివాదం : గోపీచంద్‌కు ఊరట

సోమవారం, 22 సెప్టెంబరు 2008 (18:00 IST)
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు గతంలో కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి చుక్కెదురైంది. దీంతో భూ వివాదానికి సంబంధించి గోపీచంద్‌కు ఊరట లభించినట్టైంది.

తనకు కేటాయించిన భూమిలో కొంతభాగాన్ని తిరిగి తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వ నిర్ణయంపై గోపిచంద్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు గోపీచంద్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. గోపీచంద్‌కు కేటాయించిన భూమిని తిరిగి తీసుకోరాదంటూ కోర్టు స్టే విధించింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన గోపీచంద్‌కు అకాడమి స్థాపనకై గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఈ భూమిలో కొంతభాగాన్ని వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ తాజాగా నిర్ణయించింది. గోపీచంద్‌కు కేటాయించిన భూమిలో పూర్తిభాగం అకాడమీ నిర్మాణం చేపట్టలేదని అందుకే తామీ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొంది.

అయితే తాను నిబంధనల ప్రకారమే అకాడమీ నిర్మాణం చేపట్టానని అందువల్ల తనకు కేటాయించిన భూమిని వెనక్కు తీసుకోరాదని గోపీచంద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై గోపీచంద్ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కలిస తన విజ్ఞప్తిని కూడా తెలియజేశారు. ఈ సందర్భంలో కోర్టు తీర్పు గోపీచంద్‌కు అనుకూలంగా వెలువడడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి