ఏసియన్ గేమ్స్ స్వర్ణమే లక్ష్యం : హరేంద్ర సింగ్

మంగళవారం, 30 సెప్టెంబరు 2008 (19:54 IST)
చైనాలో 2010లో జరగనున్న ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణాన్ని సాధించడమే లక్ష్యంగా భారత హాకీ జట్టుకు తాను కోచింగ్ ఇవ్వనున్నట్టు కొత్త కోచ్ హరేంద్ర సింగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా అదే ఏడాదిలో జరిగే మిగితా పోటీల్లో ఫైనల్ బెర్త్‌ను సాధించడం కూడా తన లక్ష్యాల్లో భాగమని ఆయన వ్యాఖ్యానించారు.

భారత హాకీ జట్టుకు కోచ్‌గా నియమించబడిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో భారత హాకీని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లేలా చేస్తానన్నారు. రానున్న 2010లో భారత్ ఆతిథ్యమిస్తున్న కామన్‌వెల్త్ గేమ్‌లో ఫైనల్‌కు చేరేలా హాకీ జట్టుకు తాను శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.

అలాగే అదే ఏడాది జరగనున్న హాకీ ప్రపంచ కప్‌లో కూడా ఫైనల్ చేరడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ రెండూ కాకుండా అదే ఏడాది చైనాలో జరగనున్న ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణాన్ని సాధించే దిశగా కూడా తన శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.

భారత హాకీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను చవిచూస్తున్న విషయం తెలిసిందే. గతంలో స్వర్ణ యుగాన్ని చవిచూసిన భారత హాకీ గత కొన్నేళ్లుగా పతనావస్థకు దిగజారింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ పోటీలకు భారత హాకీ జట్టు కనీసం అర్హత కూడా సాధించలేక పోయింది.

ఈ నేపథ్యంలో భారత హాకీని ప్రక్షాళన చేసేందుకు ఎమ్.కే. కౌశిక్‌ను కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే భారత మహిళా హాకీ జట్టుతో ఉన్న కాంట్రాక్ట్ పూర్తి కాని కారణంగా కౌశిక్ పురుషుల జట్టుకు శిక్షకుడిగా రాలేకపోయాడు. ఈ నేపథ్యంలో హరేంద్రసింగ్‌ను భారత హాకీ కోచ్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి