ఢిల్లీ వాసులపై ఆర్థికభారం మోపనున్న కామన్వెల్త్ గేమ్స్!!

'ఎంకి పెళ్లి సుబ్బికి చావు' అనే చందంగా ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల నిర్వహణ మారాయి. ఈ క్రీడల కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ భారం ఢిల్లీ వాసులు అధికంగానూ, దేశ ప్రజలు పాక్షికంగాను మోయాల్సి ఉంటుంది. ప్రధానంగా హస్తినలో అన్ని రకాల ధరలు భారీగా పెరుగుతాయని, వీటితో పాటు ఢిల్లీ వాసులు చెల్లిస్తున్న ప్రస్తుత పన్నులు మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

ఢిల్లీకి చెందిన హాజార్డ్ అనే సంస్థ ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ నిధులు, వాటి ప్రభావంపై ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. దీంతో ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. అక్టోబరు మూడో తేదీ నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగనున్నాయి. ఇందుకోసం కేంద్రం 1,02,079 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.

ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఢిల్లీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది మన ఒక గర్వకారణమే. అయితే, ఈ క్రీడల నిర్వహణకు ఖర్చు చేసే మొత్తంలో కొంత భాగాన్ని ప్రజలు భరించాల్సి రావడమే జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నిధులను ప్రస్తుతం కేంద్ర ఖజానా నుంచి ఖర్చు చేస్తున్నప్పటికీ వీటిని ప్రజల నుంచి 25 నుంచి 30 సంవత్సరాల కాలంలో వసూలు చేయనున్నారు. పన్నుల రూపేణా, ఇతరాత్రా మార్గాల ద్వారా వసూలు చేస్తారు. ఫలితంగా ఢిల్లీ వాసులు మరింత ఆర్థిక భారంతో సతమతం కానున్నారు.

దీనిపై హజార్డ్ డైరక్టర్ డోనోరాయ్ స్పందిస్తూ సాధారణంగా ప్రపంచ స్థాయి క్రీడలను నిర్వహించే నగరం.. క్రీడలు ముగిసిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం గత చరిత్ర చెబుతోందని గుర్తు చేశారు. 2004లో ఏథెన్స్ నగరం ఒలింపిక్ క్రీడలను నిర్వహించింది. ఇందుకోసం వేలాది మిలియన్ డాలర్లను ఖర్చు చేసిందన్నారు. ఆ తర్వాత ఈ నగరం ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందని తమ అధ్యయనంలో తేలినట్టు ఆయన అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి