నాదల్ జోరుకు ఫ్రెంచ్ ఓపెన్ వందనం

Pavan Kumar

సోమవారం, 9 జూన్ 2008 (18:49 IST)
స్పెయిన్ వీరుడు, ప్రపంచ రెండో నెంబరు క్రీడాకారుడు రఫెల్ నాదల్ జోరుకు పారిస్ వేదికగా ప్రతి ఏటా జరిగే ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ మరో వందనం చేసింది. స్పానిష్ సంచలన వీరుడు నాదల్ వరుసగా మూడోసారి స్విస్ ధిగ్గజం రోజర్ ఫెదరర్‌ను ఓడించాడు.

స్పానిష్ బాయ్ నాదల్ మట్టి కోర్టు వీరుడుగా పేరు సంపాదించాడు. గత నాలుగేళ్లుగా ఇక్కడ జరిగిన ఫైనల్స్‌లో మెరుగ్గా రాణించి తనదైన రీతిలో ధీటుగా స్పందించి ప్రత్యర్ధుల తలలు వంచాడు నాదల్. ప్రపంచంలో ఎక్కడ టెన్నిస్ టోర్నీ ఫైనల్ జరిగినా హీరోగా నిలిచే ఫెడెక్స్ (ఫెదరర్) పారిస్‌లో మాత్రం నాదల్‌కు సలాం కొట్టాల్సిందే.

స్పానిష్-స్విస్ వీరుల ఫైనల్ పోరుకు తెర లేచింది మొదటిసారి 2005 మియామీ టోర్నీలో. అమెరికాలోని మియామీ వేదికగా జరిగిన టోర్నీలో ఫెదరర్ 2-6, 6-7, 6-3, 6-1 సెట్ల తేడాతో నాదల్‌ను తొలిసారి మట్టికరించాడు. నాదల్ తొలి రెండు సెట్లలో పరాజయం పాలైనప్పటికీ తదుపరి రెండు సెట్లలో ఫెడెక్స్‌ను పరాజయం పాల్జేసి తన తఢాకా ఏమిటో చూపించాడు. కీలకమైన చివరి సెట్‌లో 6-1 తేడాతో ఫెదరర్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.

నాదల్-ఫెదరర్‌లు ఫ్రెంచ్ ఓపెన్‌ టైటిల్ కోసం మూడుసార్లు వరుసగా 2006 నుంచి జరిగాయి. అన్నింట్లోనూ నాదల్‌దే హవా. దీనికి వ్యతిరేకంగా సాగింది బ్రిటన్ వింబుల్డన్ పోరు. వీరిద్దరూ 2006, 07లలో తలపడగా ఫెదరర్ రెండసార్లు విజేతగా నిలిచాడు.

వింబుల్డన్ 2006 ఫైనల్ మూడో సెట్‌లో నాదల్ విజయం సాధించినప్పటికీ దానిని కొనసాగించటంలో విఫలం అయి టైటిల్ కోల్పోయాడు. 2007 ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు సెట్ నాదల్ వశం అయినపప్పటికీ గత ఏడాది ఫలితమే పునరావృతమైంది.

ఏటీపీ మాస్టర్స్ సిరీస్ పోరులో నాదల్ 11సార్లు విజేతగా నిలిచాడు. ఇందులో నాదల్-ఫెదరర్‌ల పోరు 5సార్లు జరగ్గా అన్నింట్లోనూ నాదల్‌దే హవా. 2006, 2008లలో రెండేసి చొప్పున ఫైనల్స్ వీరిద్దరూ ఆడారు. రఫెల్ నాదల్ ఇటీవల కాలంలోని కెరీర్‌ను ఒకసారి అవలోకనం చేసుకుంటే ప్రపంచ నెంబర్‌వన్ స్థానాన్ని స్పెయిన్ వీరుడు కైవసం చేసుకునే రోజు చాలా దగ్గరలోనే ఉందని చెప్పాలి. నాదల్ నిలకడైన ఆటతీరుతో ఫెడెక్స్ జోరుకు పగ్గాలు వేయటంలో సఫలుడు కాగలడని ఆశిద్దాం.

వెబ్దునియా పై చదవండి