గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరిచిపోకముందే.. ఎయిరిండియాకు చెందిన మరో విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఢిల్లీ నుంచి వియన్నా వెళుతున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గాల్లో ఒక్కసారిగా 900 అడుగుల కిందకు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. విమానం కూలిపోతోంది, కూలిపోతోందంటూ కేకలు వేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జూన్ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నాకు ఎయిరిండియా 777 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం కారణంగా విమానం అకస్మాత్తుగా భూమివైపు దూసుకొచ్చింది. 900 అడుగుల మేర కిందకి దిగడంతో వెంటనే ప్రమాదం హెచ్చరిక సిగ్నల్స్ మోగాయి. అప్రమత్తమైన పైలెట్లు వెంటనే విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటనను డైరెక్టరేట్ జనవర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా పరిగణించింది. తక్షణమే విచారణకు ఆదేశించడమే కాకుండా, ఆ విమానాన్ని నడిపిన ఇద్దరు పైలెట్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జూన్ 17వ తేదీన ఎయిరిండియా భద్రతా విభాగాధిపతికి డీజీసీఏ సమన్లు జారీచేసింది.