మరింతకాలం కెరీర్ కొనసాగిస్తా : పేస్

శనివారం, 6 సెప్టెంబరు 2008 (16:48 IST)
తన కెరీర్‌ను మరింతకాలం కొనసాగించే అవకాశముందని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పేర్కొన్నాడు. తాను ఆటను ఆస్వాదించగరల్గినంత కాలం తన కెరీర్ కొనసాగుతూనే ఉంటుందని పేస్ వ్యాఖ్యానించాడు.

తాజాగా జరుగుతోన్న అమెరికా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెల్చుకున్న పేస్ డబుల్స్‌లో మాత్రం రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేస్ మాట్లాడుతూ తనకు వయసు అయిపోతోందని తానెప్పుడూ భావించడం లేదన్నాడు. ఆటలో తనకు ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు టెన్నిస్ కెరీర్‌కు తాను గుడ్‌బై చెబుతానని పేస్ పేర్కొన్నాడు.

గతంలో రెండుసార్లు యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను తృటిలో కోల్పోవడం తనకు చాలా బాధ కల్గించిందని పేస్ అన్నాడు. అందుకే ఈసారి ఎలాగైనా మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ నెగ్గి తీరాలన్న కసితో ఆడానని పేస్ పేర్కొన్నాడు. తన మిక్స్‌డ్ డబుల్స్ జోడీ అయిన కారాబ్లాక్‌తో తనకు చక్కని సమన్వయం ఏర్పడిందని పేస్ పేర్కొన్నాడు.

భవిష్యత్‌లోనూ తమ జోడీ కొనసాగుతుందని పేస్ తెలిపాడు. పైనల్‌లో కారాబ్లాక్ విజృంభించడం వల్లే టైటిల్ తమ సొంతమైందని పేస్ పేర్కొన్నడు. ప్రస్తుతం సాధించిన ఈ విజయం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ నెగ్గడమే తన తదుపరి లక్ష్యమని పేస్ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి