టెన్నిస్ క్రీడలో అత్యుత్తమంగా రాణించిన అమెరికా క్రీడాకారుల్లో ఆండ్రీ అగస్సీ ఒకరు. ప్రపంచ మాజీ నెంబర్‌వన్ అయిన అగస్సీ కెరీర్‌లో ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో పాటుగా ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆండ్రకీ కిర్క్ అగస్సీ 1970 ఆగస్టు 29వ తేదీన నెవాడాలోని లాస్ వెగాస్‌లో జన్మించారు.
అగస్సీ తండ్రి ఇమ్మానియేల్ అగస్సీ ఇరాన్ దేశం తరపున 1948, 52 ఒలింపిక్ క్రీడల్లో బాక్సింగ్ ఆడాడు. ఆ తర్వాత అమెరికాకు వలస వచ్చాడు. తన కొడుకు గొప్ప టెన్నిస్ క్రీడాకారుడు కావలనేది అగస్సీ తండ్రి కల. ఇమ్మానియేల్ అమెరికాకు వచ్చిన తర్వాత ఎలిజబెత్‌ను పెళ్లాడాడు. వారికి ఆండ్రీ అగస్సీ జన్మించాడు. చిన్ననాటి నుంచే అగస్సీ టెన్నిస్ బంతులతో ఆడటం మొదలుపెట్టాడు.
అగస్సీ 1986లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా మారి 1987లో ఇటాపార్సికా సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. అదే ఏడాది 25వ ర్యాంకులో నిలిచాడు. 1988లో ఆరు టోర్నీలలో ఆగస్సీ జయకేతనం ఎగురవేశాడు. ఆ తర్వాత వరుసగా 43 టోర్నీలు ఆడిన అనుభవంతో 1988 చివరినాటికి ప్రపంచ మూడో నెంబర్ క్రీడాకారుడిగా అగస్సీ ఎదిగాడు. టెన్నిస్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ర్యాంకుకు ఎదిగిన తొలి క్రీడాకారుడు అగస్సీ.
1988లో జరిగిన ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరుకుని అగస్సీ పరాజయం పాలయ్యాడు. 1989 యూఎస్ ఓపెన్‌లోనూ అదే పరిస్థితి. సెమీస్ గండాలను అధిగమించి 1990లో ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్‌లలో ఆగస్సీ ప్రవేశించినప్పటికీ అదృష్టం మారలేదు.
అమెరికా అగ్రశ్రేణి క్రీడాకారుడైన పీట సంప్రాస్-అగస్సీల మధ్య టెన్నిస్‌లో ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతున్న సమయమది. ఈ తరుణంలో సంప్రాస్-అగస్సీలు జోడిగా దిగి 1990 డేవిస్ కప్ అమెరికా పరమయ్యేలా పోరాడారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత డేవిస్ కప్ అమెరికా పరమైంది.
వింబుల్డన్ 1992 ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియాకు చెందిన గోరాన్ ఇవానిసెవిక్‌తో ఐదు సెట్లు ఆడి నాలుగు సెట్లలో అగస్సీ విజయకేతనం ఎగురవేసి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను 1995, 2000, 2001, 2003, ఫ్రెంచ్ ఓపెన్ 1999లోనూ, వింబుల్డన్ టైటిల్‌ను 1992లోనూ, యూఎస్ ఓపెన్ 1994, 99లలో అగస్సీ కైవసం చేసుకున్నాడు. వింబుల్డన్ 1992 టైటిల్‌ను అగస్సీ కైవసం చేసుకున్నప్పటికీ 1995లో ఆస్ట్రేలియన్నఓపెన్ టైటిల్ అందుకున్న తర్వాతే అగ్రశ్రేణి ఆటగాటయ్యాడు. 1996 అట్లాంటా ఒలింపిక్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని అగస్సీ అందుకున్నాడు. 2006 యూఎస్ ఓపెన్ తర్వాత అగస్సీ టెన్నిస్ క్రీడ నుంచి నిష్క్రమించాడు.
అగస్సీ వ్యక్తిగత జీవితంలో అమెరికా గాయకురాలు బార్బా స్ట్రెయిసాండ్‌తో 1990 వరకూ గడిపాడు. అమెరికా సినీ తార బ్రూక్ షీల్డ్స్‌ను అగస్సీ 1997లో పెళ్ళి చేసుకున్నప్పటికీ రెండేళ్లలోనే వారిద్దరూ విడిపోయారు. జర్మనీ అగ్రశ్రేణి మహిళా క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్‌తో అగస్సీ 1999 నుంచి సన్నిహితంగా తిరగటం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2001లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు.