రక్తమోడిన లండన్ వీధులు.. ఒలింపిక్ క్రీడల కోసం పోలీసుల డ్రామా!

శుక్రవారం, 24 ఫిబ్రవరి 2012 (11:52 IST)
బ్రిటన్ రాజధాని లండన్ నగరం అకస్మాత్తుగా తీవ్రవాద దాడులతో హోరెత్తిపోయింది. జన జీవనం అల్లకల్లోలమైపోయింది. ఎక్కడ చూసినా గాయాల పాలయిన ప్రజలే. రోడ్డు పక్కన తమ మానాన తాము నడుచుకుంటూ వెళ్తున్న అమాయకులపై తీవ్రవాదులు చెలరేగిపోయారు. బాంబుల దాడితో వీధుల్లో రక్తం ఏరులై పారింది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమవగా పోలీసులు ఈ సంఘటన కారణాలను అన్వేషించే పనిలో బిజీ అయిపోయారు. సంఘటనా స్థలిలో పోలీసుల కన్నా మీడియా ప్రతినిధులే ఎక్కువ కనిపించారు......

అయ్యయ్యో..ఏమిటీ ఘోరం.. అనుకుంటున్నారా? ఆగండాగండి.. ఇదంతా, ఉత్తుత్తిదే. ఒక విధంగా చెప్పాలంటే నిజ జీవిత డ్రామా. నిజంగానే టెర్రరిస్టు దాడులు జరిగినపుడు, ఎలా స్పందించాలీ? దానికి బ్రిటన్ పోలీసు వ్యవస్థ ఎంతవరకు సన్నద్ధంగా ఉందో పరీక్షించడానికి ఈ ఉత్తుత్తి సీనును సృష్టించారు.

ఎప్పుడూ బిజీగా ఉండే లండన్లోని ఒక ప్రాంతంలో ఈ భయానక వాతావరణాన్ని సృష్టించారు. అకస్మాత్తుగా బాంబులు పేలడం, నగర పౌరులు గాయపడడం, రక్తమోడటం, హాహాకారాలు చేయడం లాంటి సంఘటనలను కృత్రిమంగా సృష్టించారు. త్వరలో ప్రపంచ ప్రఖ్యాత ఒలింపిక్ క్రీడలు జరుగనున్న తరుణంలో ఏమయినా జరగరాని ఘోరం జరిగితే అనే ముందస్తు తలంపుతో దీన్ని పోలీసు శాఖ ఏర్పాటుచేసింది. విచిత్రమేమిటంటే, ఈ సీనులో మొత్తం రెండు వేల మంది పాల్గొన్నారు. వీరిలో అత్యధికులు పోలీసు శాఖకు చెందినవారే.

అయితే, ఈ విషయం తెలియని కొందరు లండన్ వాసులు, పాపం.. నిజంగానే తీవ్రవాదుల దాడి జరిగిందేమోనని బీపీలు పెంచేసుకోగా, ఇంకొందరు గుండెపోటు పాలయ్యారట. హవ్వ ఇదేమి చోద్యం.. ఇలాంటి ముందస్తు తీవ్రవాద దాడుల సన్న్తద్ధత డ్రామాలు ఎటువంటి సమాచారం లేకుండా నట్టనడి నగరంలో సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేయడమేమిటో అని వాపోతూ తమ పనుల్లో నిమగ్నమయిపోయారు.

ఇంత వరకు బాగానే ఉంది... ఈ ముందస్తు డ్రామాలు చూసి అయోమయానికి గురయిన ప్రజలు, రేపు నిజంగానే, దాడి జరిగితే దాన్ని కూడా ఈ ముందస్తు డ్రామానే అనుకుంటే ఎలా ఉంటుందో పోలీసులే చెప్పాలని ఇంకొందరంటున్నారు.

వెబ్దునియా పై చదవండి