యూఎస్ ఓపెన్‌కు టాప్ సీడ్లు రె 'ఢీ': మరి విజేత ఎవరో..!?

FILE
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ సమరం సోమవారం నుంచి ఆరంభంకానుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టాప్‌సీడ్లలో ఏ స్టార్ ఆటగాడు టైటిల్ గెలుచుకుంటాడో అని అభిమానులు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది ఫ్రెంచ్, వింబుల్డన్ టైటిళ్ల తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్న రఫెల్ నాదల్ 'కెరీర్ గ్రాండ్‌స్లామ్' సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అలాగే ఈ స్పెయిన్ బుల్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ను ఒడిసిపడతాడా? అని క్రీడాభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అలాగే బ్రిటన్ బ్రిలియంట్ ఆండీ ముర్రే, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిక్‌లలో ఎవరో ఒకరికి అదృష్టం కలిసొస్తుందా? కాదంటే... వీరందిరినీ తోసిరాజని స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ విజృభించి టైటిల్ సాధిస్తాడా? అనేది తెలియాలంటే సోమవారం నుంచి ఆరంభం కానున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మ్యాచ్‌లపై కన్నేయాల్సిందే.
FILE


కాగా, ప్రస్తుతం స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ పేలవఫామ్‌కు చెక్‌పెట్టి పూర్వవైభవం దిశలో కొనసాగుతుండటం ప్రత్యర్థులకు బెంబేలెత్తింపజేస్తోంది. అలాగే పురుషుల సింగిల్స్ విభాగంలో నాదల్, ఆండీముర్రేలు తమ తమ ప్రత్యర్థులపై గట్టిపోటీని ప్రదర్శించే ఆస్కారం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కిమ్ క్లియ్‌స్టర్స్‌కు ఈసారి విజయం నల్లేరుమీద నడకేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే చెల్లి సెరెనా గైర్హాజరీని అక్క వీనస్ సొమ్ముచేసుకోవాలని చూస్తోంది.

అలాగే నిరుటి రన్నరప్, డెన్మార్క్ టీనేజర్ కరోలిన్ వోజ్నియాకీ కూడా రాణించే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో రెండు వారాల పాటు జరిగే ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో విజేత ఎవరోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
FILE


ఇకపోతే ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో భారత తరపున సింగిల్స్‌లో సోమదేవ్ నేరుగా గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. అలాగే సానియా మీర్జా 2005 తర్వాత తొలిసారి క్వాలిఫైయింగ్ రౌండ్‌లో గెలుపును నమోదు చేసుకుని మెయిన్ డ్రాకు అర్హత సాధించింది.

కాగా.. ఇక తనకంటే 16 ర్యాంకులు దిగువన ఉన్న పోర్చుగల్ అమ్మాయి మి చెల్లె లార్చర్‌తో సానియా తొలిరౌండ్ బరిలోకి దిగనుంది. ఆరంభరౌండ్‌ను సానియా మీర్జా గనక అధిగమిస్తే.. రెండోరౌండ్‌లో 20వ సీడ్ పావుల్యుచెన్‌కోవా (రష్యా)తో పోటీపడాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి