దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ప్రపంచ సాకర్ ప్రపంచకప్.. గెలుపోటములకు వేదికవుతుంది. అలాగే కొన్ని ఉదంతాలకు సైతం నిలయమవుతోంది. ప్రపంచకప్ టోర్నీ పుణ్యమా అని దక్షిణాఫ్రికాలో దొంగలు పండగ చేసుకుంటుంటే.. సాకర్ పిచ్చి తలకెక్కి ఓ కసాయి తండ్రి కన్నకూతురినే కడతేర్చాడు. సాకర్ పైత్యం ప్రకోపించి, కన్నకూతురినే చంపేశాడు.
ఉత్కంఠగా మ్యాచ్ను చూస్తున్న సమయంలో తన రెండేళ్ల కూతురు ఏడుపు లంకించుకోవడంతో విసుగు చెందిన కసాయి తండ్రి, ఆ చిన్నారి గొంతులో పాశవికంగా స్క్రూ వేశాడు. దీంతో ఆ చిన్నారి ఏడ్వలేక, అరవలేక గిలకొట్టి తుదిశ్వాస విడిచింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన అమెరికాలో సంచలనం రేపింది.
ఉన్మాదిలా మారి కన్న కూతురినే బలిగొన్న ఆ కసాయి తండ్రి పేరు హెక్టర్ క్యాస్ట్రో (28). ఆ చిన్నారికి గొంతులో స్క్రూ వేయడం వల్ల ఊపిరాడక మృత్యువు ఒడిలోకి చేరుకుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఆ పాపాయిని క్యాస్ట్రో చిత్ర హింసలకు గురిచేసినట్టు కూడా సమాచారం. కాగా క్యాస్ట్రోకు ఆ చిన్నారి సవతి కూతురు కావడంతోనే ఆ పాపాయిని చంపేందుకు ఒడిగట్టాడని పోలీసులు చెబుతున్నారు.