క్వాలిఫైయర్స్ పోటీల్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ పోటీల్లో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో పోలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-2 స్కోరుతో ఘనవిజయం సాధించింది. వరుసగా ఐదు విజయాలతో లీగ్ దశలో అజేయంగా నిలిచింది. గెలుపు తేడా రెండు గోల్స్ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్‌లో నెగ్గేందుకు భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌ని కూడా గెలవాలన్న తపనతో ఆడిగెలిచారు. భారత్ తరపున స్టార్ డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్ మరోసారి ఆటలో తన మార్క్‌ను చూపించాడు. ఈ మ్యాచ్‌లో శివేంద్రసింగ్ (59వ), రఘునాథ్ (65వ)లు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
లీగ్ దశ తర్వాత 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, పది పాయింట్లతో ఫ్రాన్స్ జట్టు రెండవ స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఈ ఏడాది లండన్ ఒలంపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.