ప్రతిష్టాత్మక మెమోరియల్ టోర్నమెంట్‌లో ఆడుతానని అమెరికా స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ స్పష్టం చేశాడు. మెడనొప్పితో బాధపడుతున్న టైగర్ వుడ్స్, వచ్చే వారంలో ప్రారంభం కానున్న మెమోరియల్ గోల్ఫ్ టోర్నీలో ఆడుతానని తన వెబ్‌సైట్ రాసుకున్నాడు.
మే తొమ్మిదో తేదీ జరిగిన ది ప్లేయర్స్ ఛాంపియన్‌షిప్ నుంచి మెడనొప్పి గాయం కారణంగా తప్పుకున్న టైగర్ వుడ్స్, మూడు వారాల తర్వాత తిరిగి పీజీఏ టూర్ ఛాంపియన్‌షిప్ మెమోరియల్ టోర్నీలో ఆడనున్నాడు.
మౌరిఫీల్డ్ విలేజ్‌లో వచ్చేవారం ప్రారంభం కానున్న మెమోరియల్ టోర్నీలో ధీటుగా రాణించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని టైగర్ వుడ్స్ తన వెబ్‌సైట్‌లో తెలిపాడు. మెడనొప్పి గాయంతో గోల్ఫ్‌కు దూరమైన తాను వైద్యుల సలహాల మేరకే ఈ టోర్నీలో పాల్గొంటున్నానని వుడ్స్ చెప్పాడు.
ప్రస్తుతం ఫిజియోథెరపీ చికిత్స తీసుకుంటున్న తాను మెడనొప్పి నుంచి మెల్ల మెల్లగా కోలుకున్నానని, మెడిటేషన్, మసాజ్‌ల ద్వారా వచ్చే వారంలోపు పూర్తి ఫిట్‌నెస్‌తో సిద్ధమవుతానని టైగర్ వుడ్స్ వెబ్‌సైట్‌లో వెల్లడించాడు.
అయితే మెడనొప్పి నుంచి ఇంకా వందశాతం కోలుకోలేదని వుడ్స్ తెలిపాడు. కాగా గత ఏడాది మెమోరియల్ టోర్నీ విజేతగా నిలిచిన టైగర్ వుడ్స్, ఈ సంవత్సరం కూడా మెమోరియల్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.