ప్రస్తుతం అంతా ఇపుడంతా సెల్ఫీలమయమే. ఫలానా లొకేషన్లో ఉన్నామని.. గర్వంగా సోషల్ మీడియాలో చాటుకునేందుకు సెల్ఫీలు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. కొండాకోనలు, లోయలు, పర్వతాలు, నదులు, సముద్రాలు.. ఇలా ఎక్కడైనా సరే, ఎంత రిస్క్ ప్లేసయినా సెల్ఫీలు తీసుకునేందుకు యువత వెనక్కి తగ్గట్లేదు. తాజాగా సెల్ఫీ తీసుకుంటూ జాతీయ స్థాయి అథ్లెట్ పూజా కుమారి (20) ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే.. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భోపాల్లో నిర్వహిస్తున్న హాస్టల్లో మూడేళ్ల పాటు ఉంటున్న పూజా కుమారి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ.. ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందింది. సహచర క్రీడాకారిణులతో కలసి చెరువుకు వెళ్లిన పూజా కుమారి సెల్ఫీకి ప్రయత్నించి నీటిలో పడింది. ఆమెకు ఈత రాకపోవడంతో సాయం చేయాలని కేకలు పెట్టినా ఫలితం లేకపోయింది.
ఈతగాళ్ల సాయంతో చెరువు నుంచి పూజా కుమారి బయటకు తీసి, ఆస్పత్రికి తరలించినా.. ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన భోపాల్ స్పోర్ట్స్ అథారిటీలో విషాదఛాయలు అలముకున్నాయి. మెరుగ్గా రాణించే క్రీడాకారిణిని కోల్పోయినట్లు భోపాల్ స్పోర్ట్స అథారిటీ తేల్చింది.