ప్రచారం కోసమే నగదు - పురస్కారాలు ప్రకటించారా? దుమారం రేపుతున్న సాక్షి మలిక్ ట్వీట్లు

ఆదివారం, 5 మార్చి 2017 (08:17 IST)
సాక్షి మాలిక్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్. రియో ఓలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించిన మల్లయుద్ధ క్రీడాకారిణి. ఈ సందర్భంగా తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రెజ్లర్ సాక్షి ట్విట్టర్ వేదికగా హర్యానా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. హర్యానా ముఖ్యమంత్రి సీఎం ఖట్టర్, హర్యానా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్, కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ తదితరులను ఉద్దేశిస్తూ ఆమె ఈ ట్వీట్ల వర్షం కురిపించారు. 
 
కేవలం మీడియాలో ప్రచారం కోసమే తనకు నగదు, ఇతర పురస్కారాలను ప్రకటించారా? అంటూ ప్రశ్నించారు. సాక్షికి రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తామని హర్యానా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఈ నగదుతో పాటు.. ఇతర పురస్కారాలను హర్యానా సర్కారు ఇప్పటికీ ఇవ్వలేదు. 
 
అయితే, ఆ రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ మాత్రం హర్యానా సర్కారు సాక్షికి ప్రకటించిన మొత్తం నగదు బహుమతితో పాటు.. ఇతర పురస్కారాలను ఇచ్చేశామని స్పష్టంచేశారు. అలాగే, ఎమ్‌డి యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలని కోరితే ఆ పోస్టు కూడా సృష్టించామన్నారు. కానీ సాక్షి తాజాగా చేసిన ట్వీట్లు అటు హర్యానా సర్కారుతో పాటు ఇటు దేశ ప్రజల్లో సంచలనం రేపుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి