మేరీకోమ్ అదుర్స్.. పోలాండ్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం

ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (15:25 IST)
భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ మరోసారి తన సత్తా ఏంటో చాటుకుంది. పోలాండ్‌లో జరుగుతున్న సిలిసియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మేరీకోమ్ తన బలం ఏంటో నిరూపించుకుంది. 48 కేజీల విభాగంలో కజిఖిస్థాన్‌కు చెందిన ఐగెరిం కసనవేయాను 5-0 తేడాతో చిత్తు చేసింది. తద్వారా స్వర్ణ పతకం సాధించింది. ఐదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన కోమ్‌ ఈ ఏడాదిలో మూడో బంగారాన్ని సాధించుకుంది. 
 
అలాగే సిలేసియన్‌ ఓపెన్‌ పోలిష్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత అమ్మాయి జ్యోతి గులియా పసిడి పంచ్‌ విసిరింది. యూత్‌ కేటగిరి ఫైనల్లో జ్యోతి.. స్థానిక బాక్సర్‌ తాతియానాను చిత్తుచేసి స్వర్ణం సాధించింది. ఇక, భారత సీనియర్‌ మహిళా బాక్సర్‌ సరితా దేవి (60 కి) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీస్‌లో 0-5తో కరీనా (కజకిస్థాన్‌) చేతిలో సరిత ఓడింది. 
 
మరో ఇద్దరు భారత బాక్సర్లు లవ్లీనా బొర్గైన్‌ (69 కి), పూజా రాణి (81 కి) సెమీ‌స్‌లో ఓడి కాంస్యాలు అందుకున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత జూనియర్లు ఓవరాల్‌గా 13 పతకాలు (6 స్వర్ణాలు, 6 రజతాలు, ఓ కాంస్యం) కొల్లగొట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు