టోక్యో 2020 ఓలింపిక్స్ పోటీల ప్రారంభం.. సాయంత్రం 4.25 నుంచి... (Video)

ఆదివారం, 11 జులై 2021 (14:53 IST)
జపాన్ దేశ రాజధాని టోక్యో వేదికగా గత యేడాది జరగాల్సిన ఒలింపిక్స్2020 పోటీలను ఈ యేడాది నిర్వహిస్తున్నారు. మరో 12 రోజుల్లో ఈ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా పోటీలు.. ఆగస్టు 8వ తేదీ వరకు జరుగుతాయి. 
 
మెగా ఈవెంట్‌లో 33 క్రీడాంశాల్లో 205 దేశాలకు చెందిన అథ్లెట్లు తలపడుతున్నారు. ప్రారంభ కార్యక్రమం ఈ నెల 23న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.25కి మొదలు కానుంది. 
 
ఈ సందర్భంగా జపాన్‌ కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దేశాల పరేడ్‌తోపాటు ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటాయి. భారత్‌లో ఈ కార్యక్రమాలను సోనీ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.. 
 
ఇదిలావుంటే, ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత అథ్లెట్లకు టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు దేశ ప్రజలంతా భారత క్రీడాకారులకు నైతిక మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. 
 
మిథాలీరాజ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రహానె, హర్మన్‌ప్రీత్‌, జెమీమా, హర్లీన్‌ తదితరులు ‘చీర్‌ ఫర్‌ ఇండియా’ అంటూ భార త బృందానికి విషెస్‌ చెప్పారు. ‘టోక్యో బరిలో దిగుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని మోదీతో కలిసి బీసీసీఐ కూడా మద్దతు పలుకుతోంది. మన క్రీడాకారులకు అండగా నిలుద్దాం’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు