ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా సైనా

ఆదివారం, 27 జనవరి 2019 (16:54 IST)
ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ నిలిచింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సైనా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్‌తో టైటిల్ పోరులో సైనా బరిలోకి దిగింది. 
 
కానీ మోకాలి గాయం కారణంగా మారీన్ మధ్యలోనే తప్పుకుంది. దీంతో మ్యాచ్ ముగియకుండానే సైనా టైటిల్ కైవసం చేసుకుంది. మ్యాచ్ మొదట్లో సైనా అనవసర తప్పిదం చేయడంతో కరోలినా మారిన్ తొలి పాయింట్ సాధించింది. దూకుడుగా ఆడిన మారిన్ తర్వాత 0-3తో ఆధిక్యం సాధించింది. కరోలినా తప్పిదంతో సైనాకు తొలి పాయింట్ దక్కింది. 
 
సైనా 1-4తో వెనకబడి ఉన్న సమయంలో మారిన్ కాలుకు గాయమైంది. తీవ్రమైన నొప్పితో కాసేపు ఇబ్బందిపడింది. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత మళ్లీ రాకెట్ అందుకొని కోర్టులో అడుగుపెట్టింది. కానీ గాయం తీవ్రత ఎక్కువగా వుండటంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగడంతో సైనా విజేతగా నిలిచింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు