మేఘాలయా రాష్ట్రంలోని షాన్‌బంగ్లా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్థమాన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ దుర్మరణం పాలయ్యారు. సోమవారం 83వ సీనియర్ నేషనల్, అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. వీటిలో పాల్గొనేందుకు విశ్వ వెళ్లాడు.
తమిళనాడుకు చెందిన 18 యేళ్ల విశ్వతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు గౌహతి నుంచి షిల్లాంగ్‌కు ఆదివారం సాయంత్రం ఓ కారులో బయలుదేరారు. ఈ కారు ఎన్.హెచ్-6పై షాన్‌బంగ్లా వద్దకు చేరుకోగానే ఓ ట్రక్కు వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో విశ్వ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు.
వీరిద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభంకానున్న డబ్ల్యూటీటీ యూత్ టోర్నీలో భారత్ తరపున విశ్వ ప్రాతినిథ్యం వహించాల్సివుంది. కానీ, ఇంతలోనే మృత్యువు కబళించింది.